TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్

300మందికి పైగా హాజరు…ఆట,పాటల సందడి
ఫిలడెల్పియాలో తానా (TANA) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 18న పెన్సిల్వేనియాలోని గ్లెన్మూర్లోని గ్రిఫిత్ హాల్లో నిర్వహించిన దీపావళి లేడీస్ నైట్ 2025 కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. సెలబ్రిటీలు లేకుండా మహిళలే ముఖ్య అతిథులుగా, మహిళలే స్వయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 300మందికిపైగా హాజరై ఉల్లాసంగా, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ పనుల ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు ఈ కార్యక్రమం రిలీఫ్ ఇవ్వడంతోపాటు కొత్త శక్తిని ఇచ్చేలా ఏర్పాట్లు ఉందని వచ్చినవారు చెప్పడం విశేషం. ఇంతమంది రావడం తానా సంస్థ నిర్వహించే లేడీస్ నైట్ కార్యక్రమానికి మహిళల్లో ఉన్న ఆసక్తిని తెలియజేసింది.
ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సంగీతం, డీజే, కళ్లు చెదిరే నృత్య ప్రదర్శనలు, సరదా ఆటలు మరియు స్టైలిష్ ఫ్యాషన్ షోలు వంటి అనేక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాటలు, నృత్యాలతోపాటు ర్యాంప్ వాక్ ప్రదర్శనలు హైలైట్గా నిలిచాయి. హాజరైన ప్రతి ఒక్కరికీ ఇది మరచిపోలేని ఆనందకరమైన కార్యక్రమంగా నిలిచింది. శ్వేత కొమ్మోజి తన అద్భుతమైన యాంకరింగ్తో అతిథులను అలరించారు. గాయని శ్రావణి చిట్టా అద్భుతమైన పాటలతో మంత్రముగ్ధులను చేసింది.
తానా మిడ్-అట్లాంటిక్ ఉమెన్స్ కోఆర్డినేటర్ సరోజ పావులూరి, ఆమె టీమ్ ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. భవాని క్రోతపల్లి, మైత్రి రెడ్డి నూకల, బిందు లంక, మనీషా మేక, రమ్య మాలెంపాటి, రవీణ తుమ్మల, దీప్తి కోక, భవాని మామిడి మరియు నీలిమ వొలెట్టి తదితరులు ఈ వేడుక విజయవంతానికి శ్రమించారు. ప్రతి సంవత్సరం తానా ఆధ్వర్యంలో మార్చిలో విమెన్స్ డే, అక్టోబర్ లో లేడీస్ నైట్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు జరిగాయి. నమస్తే ఇండియా రెస్టారెంట్ వారి విందు భోజనాలు, స్వర్ణ జ్యువెలర్స్ తదితర స్పాన్సర్లు అందించిన సహాయానికి ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తానా అధ్యక్షుడు డాక్టర్. నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మరియు సతీష్ తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు, నిర్వాహక బృందం కృషిని, సమర్థవంతమైన నిర్వహణను ప్రశంసించారు.
మంచి సంగీతం మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడంలో సహకరించిన తానా మిడ్-అట్లాంటిక్ కోర్ టీమ్ కు చెందిన సునీల్ కోగంటి, గోపి వాగ్వాల, మోహన్ మల్ల, కృష్ణ నందమూరి, సురేష్ యలమంచి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ క్రోతపల్లి, చలం పావులూరి, నాగరాజు చింతం, రంజిత్ కోమటి, మరియు రవి తేజ ముత్తులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.