TTA: టిటిఎ మెగాకన్వెన్షన్ కన్వీనర్ గా ప్రవీణ్ చింతా.. ఛార్లెట్ టిటిఎ బోర్డ్ సమావేశంలో నిర్ణయం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) త్రైమాసిక బోర్డ్ డైరెక్టర్ల సమావేశం ఇటీవల నార్త్ కరోలినాలోని చార్లెట్‌లో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్. పైళ్ళ మల్లారెడ్డి, టిటిఎ అడ్వయిజరీ ఛైర్ డాక్టర్. విజయపాల్ రెడ్డి, కో-ఛైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచర్లకుంట్లతో పాటు ఇతర ముఖ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రెండు ప్రధాన ముఖ్యాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. టిటిఎ మెగా కన్వెన్షన్ 2026కి కన్వీనర్ గా ప్రవీణ్ చింతాని ఎంపికచేసినట్లు ప్రకటించారు. ఈ కన్వెన్షన్ జూలై 17`19, 2026 తేదీల్లో జరగనుంది.
ఈ సమావేశంలోనే టిటిఎ నిర్వహించనున్న వేడుకలపై కూడా చర్చించారు. డిసెంబర్ 25, 2025 న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగే 10వ వార్షికోత్సవ వేడుకలపై, టిటిఎ సేవాడేస్ పై కూడా చర్చించారు. డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 22 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం 10వ వార్షికోత్సవ లోగో, సేవాడేస్ లోగోలను కూడా బోర్డ్ సమావేశంలో ఆవిష్కరించారు.
TTA తన జాతీయ స్థాయిని మరింత విస్తరించింది. బోర్డు తమ కుటుంబంలోకి రెండు కొత్త ఛాప్టర్ లను ఆహ్వనించింది. మియామి మరియు అలబామాలో ఇటీవల టిటిఎ ఛాప్టర్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ప్రాంతీయ ఉపాధ్యక్షులు దిలీప్ స్యాసాని (సిఎల్‌టి), ప్రదీప్ కాయిదపురం (పిహెచ్‌ఎల్), రాజు పార్థిరెడ్డి (ఎల్ ఎ)లను బోర్డు ప్రత్యేకంగా సన్మానించింది. అలాగే, సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన స్టాండిరగ్ కమిటీలను కూడా బోర్డు సభ్యులు అభినందించారు.
కన్వెన్షన్ సన్నాహాలు, కొత్త లోగోలు:
కన్వెన్షన్ ఏర్పాట్లలో భాగంగా, నాయకత్వ బృందం 2026 కన్వెన్షన్ సెంటర్ వేదికను విస్తృతంగా పరిశీలించింది. బోర్డు అధికారిక మెగా కన్వెన్షన్ లోగోను కొత్తగా ప్రారంభించిన కన్వెన్షన్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. సభ్యత్వం పెరుగుదల మరియు కమ్యూనిటీ భాగస్వామ్యం పెరగడంతో టిటిఎ మరింత పటిష్టంగా వృద్ధి చెందుతోందని ప్రకటించారు. రాబోయే త్రైమాసికంలో మరింత సేవా-కేంద్రీకృత ఎజెండాతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమావేశం విజయవంతం కావడానికి సమన్వయం మరియు అంకితభావం చూపిన ఎసి,ఇసి, బోర్డ్ సభ్యులకు అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఛార్లెట్ లో ఘనంగా కిక్ ఆఫ్ మీటింగ్
టిటిఎ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చార్లెట్‌లో జరిగిన కన్వెన్షన్ కిక్-ఆఫ్ మీటింగ్ నిలిచింది. ఈ సమావేశంలో ఏకంగా 1.11 మిలియన్లు డాలర్లను (ఒక కోటి పదకొండు లక్షల డాలర్లు) నిధులు సేకరించారు. ఒక మెగా కన్వెన్షన్ ప్రారంభ సమావేశానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించడం ఇదే మొదటిసారి. ఇది 2026 కన్వెన్షన్ విజయానికి బలమైన పునాదిని వేసిందని చెప్పవచ్చు.