TCS: టీసీఎస్ కఠిన నిర్ణయం.. ఏకంగా 19,755 మంది ఉద్యోగుల తొలగింపు..

దేశీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కఠిన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భారీగా ఉద్యోగులను తొలగించి, టెక్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త టెక్నాలజీల రాక, మారుతున్న వ్యాపార అవసరాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా 19,755 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో సంస్థ నుంచి తొలగించబడిన వారు, స్వచ్ఛందంగా వైదొలిగిన వారు ఉన్నారు. ఈ భారీ కోతతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.2 శాతం తగ్గి, 2022 మార్చి తర్వాత మొదటిసారిగా 6 లక్షల కంటే దిగువకు పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు, పరిహారం సంబంధిత ఖర్చుల కోసం ఈ త్రైమాసికంలో సంస్థ రూ.1,135 కోట్లు (128 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపు ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ విశ్లేషకులకు తెలిపారు. ముఖ్యంగా “నైపుణ్యం, సామర్థ్యంలో వ్యత్యాసం” (స్కిల్ అండ్ కేపబిలిటీ మిస్‌మ్యాచ్) కారణంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వివరించారు. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలకు పరిశ్రమ వేగంగా మారుతున్నందున, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగులలో 2% తగ్గించాలనే లక్ష్యంలో ఇప్పటికే సగం పూర్తి చేశామని ఆయన అన్నారు.
మరోవైపు, టీసీఎస్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు బలహీనమైన వ్యాపార దృక్పథానికి సంకేతమని సిటీ అనలిస్టులు ఒక నివేదికలో అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నష్టాలకు సంబంధించిన ఏకమొత్తం చెల్లింపుల కారణంగానే ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాలు అంచనాలను అందుకోలేకపోయాయని వారు పేర్కొన్నారు. అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, మారుతున్న వలస విధానాలకు అనుగుణంగా ఇప్పటికే యూఎస్‌లో స్థానిక నియామకాలను పెంచామని, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడం కొనసాగిస్తామని సుదీప్ కున్నుమల్ స్పష్టం చేశారు.