Dubai: నేటి నుంచి సీఎం చంద్రబాబు .. యూఏఈ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అలుపెరుగని కృషి చేస్తోంది. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేటి నుంచి 3 రోజుల పాటు దుబాయ్ (Dubai)లో పర్యటించనున్నారు. విశాఖ (Visakhapatnam) లో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్‌కు బయల్దేరనున్న సీఎం మధ్యాహ్నం అక్కడకు చేరుకుంటారు. దుబాయ్ చేరుకున్న తొలిరోజు నుంచే పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. 3 రోజుల పర్యటనలో వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను కలిసేలా చంద్రబాబు పర్యటన సాగనుంది. ప్రభుత్వ ప్రతినిధులతో 3, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, 2 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్, మీడియా ఇంటర్వ్యూలు 2, సీఐఐ పీఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా ఒకటి సహా మొత్తం 3 రోజుల పాటు 25 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy), సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు.