Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు (Nominations) దాఖలయ్యాయి. చివరిరోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికిపైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం, దీపావళి(Diwali) పండుగతో రెండు రోజులు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశముండటం, అభ్యర్థులు పెద్దసంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి, అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది.