Vijay Sai Reddy: ‘కోటరీల మధ్య బందీలు’..విజయసాయిరెడ్డి ట్వీట్ ఎవరి కోసం?
వైఎస్ కుటుంబానికి ఎంతో కాలంగా అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వైసీపీకి (YCP) రాజీనామా చేసిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేశారు. వాటిలో కొన్ని నర్మగర్భంగా జగన్ను ఉద్దేశించినవేనన్న చర్చ అప్పట్లో జరిగింది. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది.
‘‘అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా, ఆలోచించుకోండి’’ అంటూ విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ (X ) వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వైసీపీలో ఉన్నప్పటి నుంచి కోటరీ వ్యవస్థపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. తాజా వ్యాఖ్యలు కూడా పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) వైపే ఉద్దేశించబడ్డాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
ఈ ట్వీట్లో విజయసాయిరెడ్డి వెనుజువెలా (Venezuela) అధ్యక్షుడి ఉదాహరణను తీసుకొచ్చారు. అక్కడ భారీ ప్రజాదరణతో ఎన్నికైన అధ్యక్షుడి చుట్టూ ఆర్మీ (Army), నేవీ (Navy), ఎయిర్ ఫోర్స్ (Air Force), ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, మిసైళ్లు, పెద్ద సైన్యం ఉన్నప్పటికీ, అమెరికా (United States of America) ఎలాంటి పెద్ద ప్రతిఘటన లేకుండా అతడిని, అతని భార్యను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి తీసుకుపోయిందంటే కారణం ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘వారంతా అమ్ముడుపోయినందుకే’’ అంటూ ఆయన ఆ ఉదాహరణకు సమాధానం చెప్పిన విధానం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఈ వ్యాఖ్యలను చాలా మంది వైసీపీ పరిస్థితితో పోలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అత్యంత బలమైన ప్రభుత్వంగా నిలిచిన పార్టీ, 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడాన్ని విజయసాయిరెడ్డి పరోక్షంగా ప్రస్తావించినట్టుగా భావిస్తున్నారు. ఆ ఘోర పతనానికి కారణం కూడా ‘‘అమ్ముడుపోయినవాళ్లే’’ అన్న సంకేతాన్ని ఆయన ఇవ్వాలని ప్రయత్నించారన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ అమ్ముడుపోయిన వారు ఎవరు, ఎవరి కోసం అమ్ముడుపోయారన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏదేమైనా విజయసాయిరెడ్డి తాజా ట్వీట్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మధ్యలో కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఆయన, మళ్లీ రాజకీయ వ్యాఖ్యలతో రంగంలోకి దిగినట్టే అనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, మద్యం కుంభకోణం కేసుకు (Liquor Scam Case) సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఆయనకు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడం మరో కీలక పరిణామంగా మారింది.





