Bihar Elections: మహాఘట్‌బంధన్ పార్టీల మధ్య ఫ్రెండ్లీ ఫైట్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి సీట్ల పంపకం పూర్తి చేసుకొని ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే విపక్ష శిబిరం మాత్రం సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తిచేసుకోలేదు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో మహాఘట్‌బంధన్‌లోని (Mahaghatbandhan) పార్టీలు మాత్రం వేటికవే సొంతంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. రెండు విడతల నామినేషన్ల గడువులు ముగిసిన వేళ కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.
ఈ కారణంగా సీట్ల షేరింగ్‌పై తుది నిర్ణయం లేకుండానే మిత్రపక్షాలు నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో సుమారు 10 స్థానాల్లో విపక్ష కూటమిలోని (Mahaghatbandhan) పార్టీల మధ్య ‘ఫ్రెండ్లీ ఫైట్’ అనివార్యమైంది. మొత్తం 243 స్థానాలకు గాను ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, సీపీఐఎంఎల్ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులను ప్రకటించాయి.
ఈ స్థానాల్లోనే ‘ఫ్రెండ్లీ ఫైట్’
నరకటియాగంజ్, వైశాలి, సుల్తాన్‌గంజ్, కహల్‌గావ్ వంటి నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు ఒకరిపై మరొకరు బరిలో దిగుతున్నారు. అలాగే బఛ్వారా, కార్‌గహర్, బిహార్ షరీఫ్, రాజా పకార్‌లలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ ఉంది. ఆర్జేడీ, వీఐపీల మధ్య కూడా బాబుహషీ, చైన్‌పూర్ నియోజకవర్గాల్లో ఘర్షణ నెలకొంది. ఈ అంతర్గత విభేదాలు విపక్ష కూటమికి (Mahaghatbandhan) పెద్ద సవాలుగా మారాయి. వీటిని అధికార ఎన్డీయే కూటమి టార్గెట్ చేస్తోంది. సీట్ల పంపకం సమయంలోనే ఏకాభిప్రాయం కుదరని పార్టీలు.. ప్రజల్లో నమ్మకం ఎలా నిలబెట్టుకుంటాయని ఎన్డీయే నేతలు ప్రశ్నిస్తున్నారు.