Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సంగీతం: గౌర హరి, ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, రచయిత : మణిబాబు కరణం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేది : 12.09.2025
నిడివి : 2 ఘంటల 49 నిముషాలు
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జ (Teja Sajja), మిరాయ్ (Mirai) అనే ఒక భారీ బడ్జెట్ గల సబ్జెక్టు ఎంచుకుని ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసివుంది. టెక్నికల్ పరంగా జాగ్రతలు తీసుకోవడంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ హీరోగా నటించగా, మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీయ శరన్, వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
కథ :
ఇది ఒక తొమ్మిది గ్రంథాల చుట్టూ తిరిగే కథ. ఈ తొమ్మిది గ్రంథాలు ప్రపంచ నలుమూలలలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఉన్న ప్రతి చోట, ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా అద్వితీయ శక్తులు ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని దాటుకుని ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుంటూ వస్తాడు మహావీర్ లామా (మంచు మనోజ్). అయితే, అమరత్వానికి సంబంధించిన తొమ్మిదవ గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే, ఆ తొమ్మిదో గ్రంథానికి రక్షణ కవచమైన అంబిక (శ్రియా శరణ్), మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ఊహించి, తన బిడ్డ వేద (తేజ సజ్జ)ను అతనిని ఎదుర్కునే ఒక ఆయుధంలా పెంచుతుంది. చిన్నప్పుడే ఆమెకు దూరమైన వేదకు తాను అంబిక పుత్రుడిని ఎప్పుడు తెలిసింది? మరి దానికి తన కొడుకు వేద ఎలా రాముని కాలానికి చెందిన మిరాయ్ ని చేజిక్కించుకొని రక్షకుడిగా మారాడు. తాను వేద నుంచి యోధ గా ఎలా పరిణామం చెందాడు? ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ కి దక్కకుండా చేశాడా లేదా? అసలు ఆ మిరాయ్ ఏంటి? మహావీర్ గతం ఏంటి? తాను పుట్టిందే లామాను ఎదుర్కోవడానికి అనే విషయం ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకున్న తర్వాత వేద సూపర్ యోధా ఎలా అయ్యాడు? చివరికి వేద లామాను ఎలా ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు:
హనుమాన్ తర్వాత మిరాయ్ తో మరోసారి తేజ రెండు భిన్న పార్శ్వాలు ఉన్న పాత్రలో మెరిసేడు. వేద పాత్రకి తేజ సరిగ్గా కుదిరాడు. మంచి లుక్స్ అండ్ ఎమోషన్స్ ని తాను పండించాడు. యాక్షన్ పార్ట్ లో అయితే అదరగొట్టాడని చెప్పవచ్చు. అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది. తాను ఈ సినిమాలో రోల్ ని చాలా ఛాలెంజింగ్ గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంధం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇది వరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు. అది చాలా యునిక్ గా అనిపిస్తుంది. వీరితో పాటుగా శ్రియా శరన్ కి సాలిడ్ రోల్ దక్కింది. అంబిక పాత్రలో శ్రియ బాగా చేశారు. అలాగే నటుడు జైరాం కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. జగపతిబాబు, హీరోయిన్ రితికా సింగ్ లు బలమైన పాత్రల్లో కనిపించి వారికి ఉన్న ముఖ్య సన్నివేశాల్లో బాగా చేశారు. గెటప్ శ్రీను రోల్ బాగుంది మంచి కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
మొదటిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురించి చెప్పాలి! తను ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా చూపించాడు. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకొని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షణీయం. ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ లో తన విజన్ కనిపిస్తుంది. కాకపోతే ఈ కథనం కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా మరింత డిజైన్ చేయాల్సింది. ఈ సినిమా థియేటర్లలో ఒక మంచి విజువల్ ఫీస్ట్. ప్రేక్షకులకు ఒక ఎగ్జైటింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం ఆకట్టుకునేలాగా ఉండగా, హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశారు. నేపథ్య సంగీతం కరెక్ట్‌గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కాకపోతే, ఎడిటర్ నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. మేకింగ్ విషయం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి వేరే చెప్పాలా? పర్ఫెక్ట్ గా వుంది.
విశ్లేషణ:
ఈ మధ్య డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. అందులో తేజ హనుమాన్ ఏ మాత్రం మినహాయింపు కాదు. అయితే, హనుమాన్ కంటే ముందే మొదలు పెట్టామని చెబుతున్న ఈ సినిమా కథ కూడా దాదాపుగా డివోషనల్ ఎలిమెంట్స్‌తోనే కూడుకున్నది. కథలో చెప్పుకున్నట్టుగానే, తొమ్మిది మహా గ్రంథాలను చేజిక్కించుకునేందుకు మహావీర్ లామా మొదలుపెట్టిన పోరాటాన్ని తేజ వేద నుంచి యోధాగా మారి ఎలా అడ్డుకున్నాడు అనేది సినిమా కథ. టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మంచి అడ్వెంచరస్ డ్రామాలు అందులో మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఎపిసోడ్స్ లాంటివి ఇష్టపడేవారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది. అయితే, యూత్ కనెక్టివిటీ కోసం తేజతో కొన్ని ఆసక్తికరమైన ఫైట్స్‌తో పాటు కామెడీ సీన్స్ కూడా రాసుకున్నాడు డైరెక్టర్. అవన్నీ బాగున్నాయి. తర్వాత మంచు మనోజ్ పాత్ర పరిచయం తర్వాత సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
మంచు మనోజ్ ఎంట్రీ తర్వాత కాసేపటికి ఒక యాక్షన్ బ్లాక్ లేదా ఆసక్తికరమైన ట్విస్ట్ ఇస్తూ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేశారు. అయితే, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినట్లు ఫీల్ కలిగించినా, మిరాయి పవర్స్ అందుకున్న తర్వాత తేజ ఫైట్స్ భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకపక్క దర్శకుడిగానే కాకుండా, మరోపక్క సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేని తనదైన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ రెండు బాధ్యతల కంటే ఎక్కువగా స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన ఆకట్టుకున్నాడు. కలింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి తొమ్మిది గ్రంథాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రక్షకులు అనే పాయింట్ దగ్గర కార్తీక్ ఘట్టమనేని ఫస్ట్ హాఫ్‌లో దాటేశాడు. తర్వాత విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టుకున్న అది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అయితే, సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం ప్రతి ఫ్రేమ్‌లోనూ తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు కార్తీక్. ఇలాంటి సినిమాలను కచ్చితంగా థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే.