Telusu Kada Movie Review: మనకు తెలియని కొత్త కథ ‘తెలుసు కదా’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ :2.75/5
నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీ నటులు : సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష, అన్నపూర్ణమ్మ, తదితరులు
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వర్సెస్, ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం: నీరజ కోన
విడుదల తేది: 17.10.2025
నిడివి : 2 ఘంటల 15 నిముషాలు
Siddu Jonnalagadda’s Telusu Kada Movie Review : ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వరుస విజయాలు అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ జోరుకు ‘జాక్’ బ్రేకులు వేసింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన సినిమా ‘తెలుసు కదా’.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి జి విశ్వ ప్రసాద్ నిర్మాతగా ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన చిత్రమిది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా… హర్ష చెముడు కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాఈ దీపావళికి థియేటర్లలో విడుదలైంది. సినిమా విశేషాలు రివ్యూ లో తెలుసుకుందాం!
కథ:
Telusu Kada Story : వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) ఓ అనాథ. పెళ్లి చేసుకుని, పిల్లలు కని తనకు అంటూ ఓ కుటుంబం ఉండాలని కలలు కంటాడు. అయితే… అతని ప్రేయసి రాగ (శ్రీనిధి) Sree Nidhi కు పెళ్లి, పిల్లలు ఇష్టం ఉండదు. బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి కొన్నేళ్లకు బయట పడతాడు. నిజాయతీగా ప్రేమిస్తే తనని ఇలా వదిలేసి పోయిందనే బాధతో వరుణ్ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. బ్రేకప్ తరువాత ఇంక లైఫ్‌లో సక్సెస్ అయి హాయిగా పెళ్లి చేసుకొని తాను కలలు కన్న ఫ్యామిలీని చూడాలనుకుంటాడు. అలా మ్యాట్రిమోనీ సైట్ ద్వారా అంజలి (రాశి ఖన్నా) Raasi Khanna పరిచయమవుతుంది. చూసిన తొలి క్షణంలోనే అంజలిని ఇష్టపడతాడు. ఒక సాంగ్ పడే లోపే ఇద్దరికీ పెళ్లి అవుతుంది. అయితే అంజలి గర్భవతి కాదని తెలుస్తుంది. తాను అనుకున్న జీవితం దక్కిందని హ్యాపీగా ఫీలవుతున్న వరుణ్‌కి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఆ బాధలో ఉన్న వరుణ్, అంజలికి రాగ తారసపడుతుంది. వరుణ్, అంజలి బిడ్డకు సరోగసి తల్లిగా ఉండేందుకు డాక్టర్ రాగ ఒప్పుకొంటుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి జీవితాల్లో ఆ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? తొమ్మిది నెలల్లో వరుణ్ ఇంట్లో రాగ ఉన్న సమయంలో అంజలికి అసలు విషయం తెలిసిందా? లేదా? మనిషిగా వరుణ్‌లో మార్పులకు కారణం ఎవరు? అనేది మిగతా కథ.
నటీనటుల హవబవాలు :
Performance of Actor, Actress : వరుణ్ పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశారు! సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు.. అదే విధంగా చాలా సింపుల్‌గా కూడా ఉన్నాడు. ముఖ్యంగా కుర్రాడిగా ఫస్ట్ లవ్ టైమ్‌లో సిద్ధూ కళ్లల్లో అమాయకత్వం కనిపిస్తే.. తర్వాత మ్యాన్లీగా మెచ్యూరిటీ ఉన్న క్లారిటీ ఉన్న కుర్రాడిగా బాగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా సిద్ధూ నటన బావుంది. సినిమాలో సిద్ధూని చూస్తున్నప్పుడు ఇద్దరి భామల మధ్య నలిగిపోయే పాత్ర అని ఆడియన్స్ అనుకునేలోపే నాది నలిగిపోయే పాత్ర కాదు టార్చర్‌తో నలిపేసే పాత్ర అన్నట్లుగా అప్పడప్పుడూ చిన్న షాక్‌లు కూడా ఇచ్చాడు. ఇక అంజలి పాత్రలో రాశి ఖన్నా అటు అందం, ఇటు నటనతో క్యూట్‌గా కనిపించింది. మరోవైపు సిద్ధూ గర్ల్‌ఫ్రెండ్ రాగ పాత్రలో శ్రీనిధి శెట్టి మంచి ఛాయిస్ అనిపించింది. స్క్రీన్ మీద సిద్ధూతో శ్రీనిధి కెమిస్ట్రీ బావుంది. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా నటించింది. ఇక హీరో ఫ్రెండ్ అభి పాత్రలో హర్ష చెముడు అక్కడక్కడా నవ్వించాడు. సెకండాఫ్ క్లైమాక్స్‌కి ముందు వచ్చిన అన్నపూర్ణమ్మ పాత్ర కూడా నవ్వించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ వున్నాయంటే వున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు :
Technical Team Effort: సినీ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు ఎంతమంది వున్నారన్నది వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. లేడీ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి తాజాగా చేరిన పేరు నీరజ కోన. సమంత, కాజల్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున ఇలా ఎంతోమంది స్టార్లకి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీరజ కోన … తొలిసారి ఆ డిజైన్స్ వెనకాల ఉన్న సృజనాత్మక మైన ప్రేమని చెప్పే ప్రయత్నం చేశారు. కథను నీరజ కోన నీట్‌గా చెప్పడం స్టార్ట్ చేశారు. హీరో సిద్ధూ క్యారెక్టరైజేషన్‌ను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే కథనం నిదానంగా సాగింది. కథలో సర్‌ప్రైజ్ చేసే మూమెంట్స్ లేవు. ప్రేమ కథలకు ట్విస్టులు అవసరం లేదు. కానీ స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఉండాలి. ఈ కథలో అది కొరవడిందని చెప్పొచ్చు. అబ్బాయిలు చెప్పే ప్రేమ కథలో ఏముంటుందిరా కిక్కు.. బాధ, వేదన, బ్రేకప్, తాగుడు, సిగరెట్, నాలుగు ఫైట్లు, మూడు కిస్సులు.. ఇంతేనా..! నిజమే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా లవ్ స్టోరీలు ఇలాగే ఉంటున్నాయి. కానీ వాటంన్నింటికీ తెలుసు కదా చాలా దూరంగా ఉంటుంది. సినిమాలో ఒక్కటంటే ఒక్క చోట కూడా ఫైట్ లేదు, వయలెన్స్ లేదు. కానీ అన్నింటికీ మించి ఒక సెన్సిబులిటీ కనిపించింది. ఎమోషన్స్‌ని డీల్ చేసిన విధానం బావుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్‌ని ఆమె రాసుకున్న తీరు కొత్తగా ఉంది. క్లైమాక్స్‌ని జస్టిఫై చేసిన విధానం కూడా ఆడియన్స్ అంగీకరించే విధంగా బాగా రాసుకున్నారు. తమన్ అందించిన పాటల్లో ‘మల్లిక గంధ’ బావుంది. మిగతా పాటలు సైతం కనుల విందుగా, వినసొంపుగా ఉన్నాయి. కథ, సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం అందించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ పెయింటింగ్‌గా ఉంది. కలర్‌ఫుల్‌గా తీశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ఇటువంటి కథపై అంత ఖర్చు చేసినందుకు నిర్మాతలను అప్రిషియేట్ చేయాలి.
విశ్లేషణ :
Analysis : ‘తెలుసు కదా’… మంచి పాయింట్ ఉన్న సినిమా. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా బావుంటుంది. అయితే సెకండాఫ్ వచ్చేసరికి ప్రతిదీ తెలుసు కదా ఇలా జరుగుతుందని అన్నట్టు ఉంటుంది. ఫ్లాట్‌గా వెళుతుంది. అదే సినిమాకు మేజర్ మైనస్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగులో చాలా వచ్చాయ్. అయితే ‘తెలుసు కదా’ లాంటి కథ ఇంతవరకూ తెలుగు తెరపై ఇప్పటి వరకూ రాలేదని చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కాంటెంపరరీ మెడికల్ టచ్ ఇచ్చారు దర్శకురాలు నీరజ కొన. కథ విషయంలో ఆవిడకు ఫుల్ మార్క్స్ పడతాయి. అయితే కథనం, సన్నివేశాలు తీసిన తీరులో తడబడ్డారు. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో ఫుల్‌గా సక్సెస్ కాలేదు. కథనంలో లోపాలు ముందు అతని కష్టం వృథా అయ్యింది. సీన్స్ కొన్ని బావున్నాయి. కథలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ లేరు. పరిస్థితులను బట్టి మనుషులు మారడాన్ని చూపించడం బావుంది. కానీ, స్క్రీన్ మీదకు అంతే మంచిగా రాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ ఎప్పటిలా క్యారెక్టర్ మీద కమాండ్ చూపించారు. నటనతో ఇంప్రెస్ చేశారు. కానీ, వినోదం విషయంలో కొన్ని చోట్ల హద్దులు దాటినప్పటికీ… హర్ష చెముడు కొంత నవ్వించారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో ఎంజాయ్ చెయ్యొచ్చు.