SSS Review: “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని”..నేను బకరాని… (ప్రేక్షకుడి ఫీలింగ్)
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నటీనటులు : శివాజీ, లయ , అలీ, ధనరాజ్ , ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్,
రాజ్ తిరందాసు, అనిష్ కురువిల్ల, శరత్ లోహితస్య , రోషన్, కరణ్ తదితరులు
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్, ఎడిటర్ : బాలు మనోజ్.డి
సినిమాటోగ్రఫీ : రిత్విక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
నిర్మాత : శివాజీ సొంటినేని, రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
విడుదల తేది :06.03.2026
నిడివి : 2 ఘంటల 27 నిముషాలు
“సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని”.. (Sampradayini Suppini Sudhapoosani)డైలాగ్‌ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుతూ ఓ ఓటిటి సిరీస్‌లో రన్ అయిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత అది పెద్ద మీమ్ మెటీరియల్ గా రీల్స్ లో వైరల్ అయిపోయింది. దీంతో అదే డైలాగ్‌ని సినిమా టైటిల్‌గా పెట్టి ఒక క్రైమ్ కామెడీతో ఈ రోజు బిగ్ స్క్రీన్ పై ముందుకు వచ్చారు శివాజీ – లయ జంట.(Shiva-Laya Combi) నటుడు శివాజీ స్వీయ నిర్మాణంలో ఈటీవీ విన్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్‌లో విడుదల చేసారు. మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా మూడు సినిమాల్లో జంటగా నటించిన శివాజీ-లయ చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇందులో జంటగా కనిపించారు. మరి శివాజీ సొంత ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అయిందా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
నీతి, నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ (శివాజీ). చిత్తూరు జిల్లాలోని సొంతూరులో పోస్టింగ్ కావడంతో ఎవరికీ భయపడడు. ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకూ ఎవరు కాల్ చేసినా కూడా తప్పు చేయకుండా తన పని తాను నిజాయతీగా చేస్తుంటాడు. ఇక తన భార్య ఉత్తర (లయ), కొడుకు మిథిల్ (రోషన్).. చేసే పనులు చూసి తలబాదుకుంటూ ఉంటాడు. వాళ్లు సరదాగా చేసే పనులు ఏదో ఒకరోజు తన పీక మీదకి వస్తాయంటూ వెటకారం ఆడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. అంతా బానే ఉందిగా అనుకునే సమయానికి దీపావళి రోజు ఎస్సై విక్రమ్ (ప్రిన్స్)తో రోడ్డు మీద గొడవ అవుతుంది. తన ఇంటికి వచ్చిన ఊరి ఎస్ఐ విక్రం హత్య కు గురవుతాడు. అసలు విక్రమ్‌ని ఎవరు చంపారు? ఈ క్రైమ్‌లో శ్రీరామ్ ఫ్యామిలీ ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది. శ్రీరామ్, ఎమ్మెల్యే (శరత్ లోహితస్య) మధ్య గొడవ ఏమిటి? శ్రీరామ్ కోసం ఎమ్మెల్యే మనుషులు ఎందుకు వెతుకుతున్నారు? ఒక వైపు ఎమ్మెల్యే మనుషులు, మరోవైపు పోలీసులు… ఇద్దరి నుంచి శ్రీరామ్ ఎలా తప్పించుకున్నాడు? అసలు విక్రమ్ శవాన్ని మాయం చేసి, ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవాలని శ్రీరామ్ భార్య ఉత్తర వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ డ్రామాలో లోకల్ ఎమ్మెల్యేకి సంబంధమేంటి? అసలు చివరికి వీళ్ల ఫ్యామిలీ ఇందులోనుంచి ఎలా బయటపడింది అనేదే మిగిలిన కథ.
ఇవి కూడా చదవండి
నటీ నటుల హవబవాలు :
శివాజీ-లయ మధ్య కెమిస్ట్రీని మినహాయించి ఇక ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. హిట్ పెయిర్ శివాజీ – లయ, సినిమాను శివాజీ స్వయంగా నిర్మించడం వల్ల ప్రేక్షకుల్లో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’పై అంచనాలు ఏర్పడ్డాయి. రీ ఎంట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న శివాజీకి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లభించింది. కానీ, కథలో కొత్తదనం లేదు. ఇక నటన విషయానికొస్తే శివాజీ ఎప్పటిలానే యాక్టింగ్ వరకూ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తన నటన పదను చూపించాడు. కానీ ఆ ఎమోషనల్ సీన్లలో బలం లేకపోవడంతో పెద్దగా వర్కవుట్ కాలేదు. లయ కాస్త కామెడీ, ఇంకాస్త క్రిమినల్ మైండ్ ఉన్న క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించారు. 90s బయోపిక్‌లో నవ్వులు పూయించిన కుర్రాడు రోషన్.. ఇందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అసలు ఆ ట్రాక్ మొత్తం పెద్దగా ఎక్కదు. అతని కామెడీ ఎక్కలేదు. ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, కాదంబరి, చిత్రం శీను సహా మిగిలినవారంతా తమ పాత్రలకి ఉన్నంతలో చెప్పినంతలో న్యాయం చేశారు. కాస్తో కూస్తో ఇమ్మానుయేల్ తన నటనతో కాసేపు ఫన్ జనరేట్ చేశాడు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ కొత్త కథతో కాకుండా హిట్ ఫార్ములాను నమ్ముకున్నారు. హీరో క్యారెక్టర్, క్రైమ్ విషయంలో ‘దృశ్యం’ ఛాయలు కనిపిస్తాయి. సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ప్రియమణి ‘భామా కలాపం’, ‘మత్తు వదలరా’ సినిమాలను సైతం గుర్తు చేస్తుంది. రంజిన్ రాజ్ సంగీతం కూడా ఈ సినిమాలో పర్వాలేదు అనిపిస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. బాలు మనోజ్ డి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. 2 గంటల 27 నిమిషాల నిడివిలో చాలావరకు సన్నివేశాలు తగ్గించాల్సింది. మైథిలి కుమార్, సుధీర్ ల రైటింగ్ చాలా వీక్ గా ఉంది. వీటితో కథనం మరింత బలహీనంగా మారింది.
విశ్లేషణ :
ఈ సినిమాలో కామెడీతో పాటు థ్రిల్, ట్విస్ట్‌లు ఏదీ చూసినా ఆసక్తిగా ముందుకు సాగలేదు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని’ ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేశారు కానీ ఇది ఆకట్టుకోకుండానే ఎండ్ అవుతుంది. శివాజీ, రోహన్ లు కొన్ని సీన్స్ లో షైన్ అయ్యారు. కానీ కథ, కథనాల్లో మాత్రం కొత్తదనం పెద్దగా లేదు. అయితే… ఈ సినిమాలో కామెడీతో పాటు థ్రిల్, ట్విస్ట్‌లు ఏదీ చూసినా ఆసక్తిగా ముందుకు సాగలేదు. ఉదాహరణకి మర్డర్ జరిగిన ఇంట్లో వాళ్లంతా సరదాగా ఒకరి మీద ఒకరు పంచులేసుకోవడం.. అసలు ఏమీ జరగలేదన్నట్లుగా తమ పనిలో తాము ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే ఏంట్రా బాబు ఈ హింస అనిపిస్తుంది. అసలు ఓటీటీకి ప్లాన్ చేసిన ఈ కంటెంట్‌ని థియేటర్లో రిలీజ్ చేద్దామని మళ్లీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలీదు కానీ.. ఓటీటీకే పరిమితం చేసుంటే బావుండేదే అని చిత్రం చూస్తూనపుడు ఫీలింగ్ కలుగుతుంది.
ఇవి కూడా చదవండి