‘డెకాయిట్’ : ఒక ప్రేమ కథ – కొంత కష్టమే!
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్
నటీ నటులు :అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్,
అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల, తదితరులు నటించారు
ఛాయాగ్రహణం:దనుష్ భాస్కర్, కూర్పు:కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం:భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్
కథ, స్క్రీన్ ప్లే :అడివి శేష్, దర్శకత్వం:షానియల్ డియో
విడుదల తేది :10.04.2026
నిడివి : 2 ఘంటల 32 నిముషాలు
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఈ సినిమాలు చూస్తే మనకి గుర్తొచ్చే జేమ్స్ బాండ్ లాంటి హీరో అడివి శేష్.(Adivi Sesh) హీరోగానే కాకుండా రైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా ఇప్పటికే తన స్థాయిని ప్రూ చేసుకున్నాడు. హిట్ 2 విడుదల తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తో ఇప్పుడు ‘డెకాయిట్’గా(Decoit) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి చిత్రీకరించారు. చిత్రీకరణ సమయంలో నటుడు అడివి శేష్ సెట్లో గాయపడటంతో విడుదల షెడ్యూల్లో సవరణ జరిగినందున నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేయబడింది. ముందుగా శ్రుతి హసన్ హీరోయిన్ అనుకున్నా…. తిరిగి గ్యాప్ తరువాత మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి యాక్టర్స్ కీలకపాత్రలు పోషించడంతో డెకాయిట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్. క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజు ముందు మీడియాకి ప్రీమియర్ షో వేశారు. రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్స్‌తో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించిన డెకాయిట్ మూవీ ఎలా ఉంది? అడివి శేష్ ఖాతాలో మరో హిట్టు పడిందా అనేది చూద్దాం.
ఇవి కూడా చదవండి
కథ:
హరిదాస్ అలియాస్ హరి (అడివిశేష్), కడప సెంట్రల్ జైలులో అత్యాచారం, హత్య కేసులో 15 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. అయితే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)(Mrunal Takur) పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. ఓ గొడవలో సరస్వతి అన్నయ్యను హరి చంపేస్తాడు. ఈ కేసులో హరి జైలుకి వెళ్లడానికి ఆమె సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం కారణంగా పదమూడేళ్లు జైలులో మగ్గిపోతాడు. తనని కావాలనే ఈ కేసులో ఇరికించేసిందని ఫిక్స్ అవుతాడు. తన లైఫ్ తిరిగి తనకి కావాలని బలంగా అనుకున్న హరి.. సరస్వతిపై రివేంజ్ తీర్చుకోవడానికి జైలులో పరిచయమైన ఇసాక్ భాయ్ (అతుల్ కులకర్ణి)ని తాను తప్పించుకునేందుకు హెల్ప్ అడుగుతాడు.తప్పించుకుంటాడు హరి. సరస్వతి భర్త గుండెజబ్బుతో బాధపడుతున్నాడని, ఆపరేషన్‌కు డబ్బులు అవసరమని హరికి తెలుస్తుంది. సరస్వతి భర్తకు ట్రీట్మెంట్ ఇస్తున్న అదే హాస్పిటల్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేస్తాడు హరి. ఇక బయటికి వచ్చిన తర్వాత తిరిగి సరస్వతిని చూస్తాడు. మరి సరస్వతి అప్పుడు ఏ స్థితిలో ఉంది.. అసలు హరిని ఈ కేసులో సరస్వతి ఎందుకు ఇరికించింది..? డబ్బు దొంగతనం చేసి సరస్వతిని పోలీసులు ముందు ఇరికించి తాను ఎస్కేప్ కావాలని హరి అనుకుంటాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? ప్రాణంగా ప్రేమించిన సరస్వతిపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడా? సరస్వతి గురించి హరికి తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? సరస్వతి ప్రేమ కోసం హరి ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? వారి లైఫ్‌లోకి పోలీస్ ఆఫీసర్ స్వామి (అనురాగ్ కశ్యప్), మల్లి (కామాక్షి భాస్కర్ల) ఎలా వచ్చారు అన్నదే డెకాయిట్ మూవీ కథ.
నటీ నటుల హవబావాలు:
డెకాయిట్‌కు అడివిశేష్ వన్ మెన్ షోగా నిలిచాడు. హీరోగా ఎక్కువగా క్లాస్ పాత్రలు చేసిన అడివిశేష్ ఇందులో మాస్ రోల్లో మెప్పించాడు. మ్యానరిజమ్స్, బాడీలాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. హరి పాత్ర కోసం మదనపల్లి యాస కూడా నేర్చుకున్నాడు. ఈ సినిమా కోసం అతడు పెట్టిన ఎఫర్ట్స్ ప్రతి సీన్లో కనిపిస్తాయి. సరస్వతి పాత్రకు మృణాల్ పర్ఫెక్ట్ యాప్ట్‌గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్‌లో అడివిశేష్‌తో పోటీపడింది. ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా మల్టీపుల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించింది. సీతారామం తర్వాత మృణాల్‌కి మళ్లీ అంతలా కన్నీళ్లు కార్చే అవకాశం ఇచ్చిన సినిమా ఇదే. వీరిద్దరు మినహా మిగిలిన పాత్రలకు సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. అయితే సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి బలమైన నటులు ఉన్నారు. కానీ వీరిని ఎందుకో సరిగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రని పరిచయం చేసిన తీరు.. ఎండ్ చేయకుండా వదిలేసిన తీరు అంతగా కనెక్ట్ కాదు. అసలు ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అలానే అనురాగ్ కశ్యప్ లాంటి నటుడికి ఇంకాస్త బలమైన సీన్లు పడుంటే బావుండేది. తనకి రాసినంతవరకూ అనురాగ్ న్యాయం చేశారు. కానీ ఇంకాస్త ఆ పాత్రని ఎలివేట్ చేసుంటే బావుండేదేమో అనిపించింది. ఇక సునీల్, ఝాన్సీ, సహా మిగిలిన పాత్రలన్నీ ఓకే.
సాంకేతికవర్గం పనితీరు :
టెక్నికల్‌గా మాత్రం డెకాయిట్ బ్రిలియంట్ మూవీ. హీరోగానే కాకుండా రైటర్‌గా కూడా అడవిశేష్ ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ షానీల్ డియోతో కలిసి ఈ సినిమాకు కథను అందించాడు. రాయలసీమ, మదనపల్లి యాసలో అబ్బూరి రవి డైలాగ్స్ నాచురల్‌గా ఉన్నాయి. భీమ్స్ పాటల్లో సోసోగా ఉన్నా గ్యానీ బీజీఎమ్ మాత్రం అదిరిపోయింది. కథలోని ఫీల్‌ను చాలా సార్లు బీజీఎమ్ ఎలివేట్ చేసింది. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ రిచ్ ఫీల్‌ను కలిగించింది. అయితే ఎటొచ్చి సినిమా టైటిల్ అయిన ‘డెకాయిట్’ కంటే.. క్యాప్షన్‌గా ఇచ్చిన ‘ఒక ప్రేమ కథ’ డామినేషన్యే ఎక్కువ ఉంది. క్లైమాక్స్‌కి తగ్గట్లుగా స్క్రీన్‌ప్లేని ఇంకాస్త రేసీగా.. ఫస్టాఫ్‌లో ఏమైనా బలమైన సీన్లు ఉండుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదేమో? ఈ సినిమాకు నిర్మాత సుప్రియ యార్లగడ్డ (Yarlagadda Supriya)కూడా ఓ హీరోగా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాల లెవెల్లో మేకింగ్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి.
విశ్లేషణ :
ఈ సినిమాకి ‘ఒక ప్రేమ కథ’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చినప్పుడే ఇందులో మంచి లవ్ స్టోరీ చూపించబోతున్నారని ఆడియన్స్ సహా అందరూ అనుకున్నారు. అయితే డెకాయిట్ అనే టైటిల్ పెట్టడంతో యాక్షన్ ప్లస్ లవ్ రెండూ బ్లెండ్ చేస్తారని అర్థమైంది. సాధారణంగా అడివి శేష్ సినిమాల్లో స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్‌ని చివరి క్షణం వరకూ సీటు ఎడ్జ్‌ని కూర్చోబెట్టేలా గ్రిప్పింగ్‌గా కథనం రాసుకుంటాడు. ఇక ఈ సినిమాకి కూడా కథ, స్క్రీన్‌ప్లే అడివి శేష్యే డీల్ చేశాడు. అయితే డెకాయిట్‌లో మాత్రం స్క్రీన్‌ప్లే కాస్త స్లోగా అనిపిస్తుంది. ఇక అసలు హరి-సరస్వతి లవ్‌కి ఎందుకు సడెన్ బ్రేకులు పడ్డాయ్.. హరి ఎందుకు జైలుకి రావాల్సి వచ్చిందనే సీన్లతో ఫస్టాఫ్ అలా అలా ముగిసింది. ఇక జైలు నుంచి తప్పించుకున్న తర్వాత హరి.. తన మాజీ ప్రియురాలు సరస్వతి కష్టాలు, కన్నీళ్లు చూడటం.. తనని ఇంతగా ఇరికించినా కూడా తన లవర్‌కి హెల్ప్ చేయాలనుకోవడం.. దాని కోసం పాట్లు పడటం లాంటి సీన్లు చూసినప్పుడు గతంలో చూసిన కొన్ని సినిమా సీన్లు గుర్తొస్తాయ్. అయితే సరస్వతి.. హరిని జైలుకి వెళ్లేలా ఎందుకు చేసింది.. అనే విషయాలు రివీల్ అయినప్పుడు కాస్త సినిమా పైకి లేసింది. అయితే సినిమాని కాస్తా కూస్తో నిలబెట్టింది మాత్రం క్లైమాక్స్‌యే. ఎందుకంటే ‘ఒక ప్రేమ కథ’ అని ఇచ్చిన క్యాప్షన్‌కి జస్టిఫై అయితే చేశారు. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాని కాస్త గట్టెక్కించింది. ఎందుకంటే మొత్తం రెండున్నర గంటల సినిమాలో కాస్త యాక్షన్, కాస్త లవ్ ఇలా చూపిస్తూ.. దేనికీ సరైన న్యాయం చేయలేదనిపించింది. ఒకానొక సందర్భంలో ఏంట్రా వీళ్లకి డబ్బులు కావాల్సినప్పుడల్లా ఏదో ఏటీఎమ్‌కి వెళ్లొచ్చినట్లు హాస్పిటల్‌కి వెళ్లిపోతున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఒకే తరహాలో మూడుసార్లు దొంగతనం చేయడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్సినిమాల్లో ఉండే వేగం ఇందులో లేదు. కమర్షియల్ ఆడియెన్స్ ఇలాంటి క్లైమాక్స్‌కు కనెక్ట్ కావడం కొంత కష్టమే.
ఇవి కూడా చదవండి






