BMSW Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇది పాత కథే బ్రో!
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : SLV సినిమాస్
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్. వెన్నెల కిషోర్, తారక్ పొన్నప్ప, మురళీధర్ గౌడ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేది :13.01.2026
నిడివి :2 ఘంటల 25 నిముషాలు
కొన్నేళ్లుగా సరైన విజయం లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు మాస్ రాజా రవితేజ.(Ravi Teja) మాస్ సినిమాలతో విసుగెత్తించేసిన ఆయన ‘మాస్ రాజా’ అనే బిరుదు ను కూడా పక్కన పెట్టేసి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రమే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.(Bhartha Mahasayulaku Vignpthi) నేను శైలజ, వున్నది ఒకటే జిందగీ, చిత్రలహరి చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి ఈ సారైనా రవి తేజ సక్సెస్ సాధించడా లేదా అన్నది రివ్యూ లో చూద్దాం.
కథ :
ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరో కథే ఇది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథేంటో ఆడియన్స్‌కి ఓ క్లారిటీ వచ్చేసింది. వ్యాపారమే వ్యాపకంగా… తన భార్య బాలమణి (డింపుల్ హయతి)(Dimple Hayathi) ఆనందమే తన ఆనందంగా భావిస్తూ బతికేస్తుంటాడు రామసత్య నారాయణ (రవితేజ). అలా ఆదర్శ భర్తగా ఉన్న రామ్ వ్యాపారరిత్య ఓ సారి స్పెయిన్ వెళ్లి… అందాల రాశి అయిన మానస (ఆషికా రంగనాథ్)(Ahiska Ranganath) ప్రేమలో పడిపోతాడు. తన పేరు సత్యగా పరిచయం చేసుకొని ఇద్దరు ఒకటైపోతారు. అయితే కొంతకాలానికి ఆ మానస కాస్త హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుంది. అప్పుడు మొదలవుతుంది మన రామసత్యకి జుగల్ భంధి. దీంతో అక్కడ్నుంచి భార్యకు.. ప్రేయసికి తన నిజ స్వరూపం తెలియకుండా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం రామసత్య ఎలా తంటాలు పడ్డాడు? అతని మిత్ర బృందం దాన్ని ఎలా కవర్ చేసే ప్రయత్నం చేసింది? బాలకు.. మానసకు అసలు విషయం తెలిసిందా? తెలిస్తే వారి స్పందనేంటి.. చివరికి రామసత్య పరిస్థితి ఏమైంది అన్నది మిగతా కథ.
నటీనటుల హవభావాలు :
టాలీవుడ్లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్టైనర్ అయితే పడలేదు. చాన్నాళ్ల తర్వాత రవితేజని ఇలా కామెడీ మూడ్‌లో చూడటం ఆడియన్స్‌కి రిఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది. ముఖ్యంగా రవితేజ నుంచి కామెడీ కోరుకునే వారికి ఈ సినిమా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. అలానే రవితేజతో సునీల్‌కి ఉన్న ట్రాక్ కూడా బాగా క్లిక్ అయింది. ముఖ్యంగా ‘కిరసనాయిల్’ ట్రాక్ బాగా నచ్చుతుంది. రవితేజ తన రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఈ సారి కాస్త కొత్తగా చేసే ప్రయత్నం చేశాడు. తన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. హీరోయిజం పూర్తిగా పక్కనపెట్టేసి, సాధారణ వ్యక్తి పాత్రలో ఒదిగిపోవడానికి రవితేజ బాగానే ప్రయత్నించాడు. హీరోయిన్లు ఇద్దరిలో ఆషికా రంగనాథ్ బాగా హైలైట్ అయింది. తన గ్లామర్ సినిమాకు పెద్ద అసెట్. ఆషికా హావభావాలు కూడా ఆకట్టుకుంటాయి. డింపుల్ హయతి నటన సోసోగా అనిపిస్తుంది. రెండు పాటల్లో ఆమె కూడా గ్లామర్ విందు చేసింది. సత్య కామెడీ సినిమాలో మేజర్ హైలైట్. సునీల్.. వెన్నెల కిషోర్ కూడా ఓ మోస్తరుగా నవ్వించారు. మురళీధర్ గౌడ్ ఓకే. తారక్ పొనప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు
సాంకేతిక వర్గం పనితీరు :
మొత్తానికి భీమ్స్ ఈ పండక్కి మాంచి ఊపులో కనిపిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియా పాటలు బాగున్నాయి. సినిమా శైలికి తగ్గ పాటలతో అతను మెప్పించాడు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అతడి వర్క్ మరోసారి సోసోగానే సాగింది. ఆర్ఆర్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నేను శైలజ.. చిత్రలహరి సినిమాలతో క్లాస్ టచ్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల. ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్ గా కథలను నడిపించడం.. భావోద్వేగాలను పండించడం అతడి శైలి. కానీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అతను రూటు మార్చాడు. ఇందులో తన రైటింగ్.. టేకింగ్ అన్నీ కూడా చాలా లౌడ్ గా అనిపిస్తాయి. కిషోర్ తిరుమలకు రచయితగా- దర్శకుడిగా ఓ మోస్తరు పనితనం చూపించాడు.
కథ తన శైలిలోనే ఉన్నప్పటికీ.. నరేషన్లో అతను రూటు మార్చాడు. “భర్త తప్పు చేశాడని తెలిస్తే చెలరేగిపోయే భార్యలు.. అదే భర్తకి ఏమైనా జరిగితే వెంటనే చల్లారిపోతారు” అంటూ సాగే కొన్ని డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. మాస్ అండ్ లౌడ్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూశాడు. అతను కథలోంచి పక్కకు వెళ్లకుండా… కామెడీ పండించే ప్రయత్నం చేయడం మెచ్చుకోదగ్గదే.ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా భర్త- భార్య- ప్రేయసి మధ్య స్టోరీ అల్లుకుని.. ట్రెండీ కామెడీతో వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు కిషోర్ తిరుమల. ఐతే కొన్ని ఎపిసోడ్లు.. కామెడీ వరకు మెప్పించినప్పటికీ.. ఒక స్థాయికి మించి ఎంటర్టైన్ చేయలేని బలహీన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని యావరేజ్ సినిమాగా నిలబెట్టింది. సెకండాఫ్ ఆరంభంలో కాస్త తడబడినా.. ప్రథమార్ధంతో అతను మెప్పించాడు. ద్వితీయార్ధాన్ని.. పతాక సన్నివేశాలను ఇంకా బిగితో తీర్చిదిద్దుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
విశ్లేషణ :
‘భర్త మహాశయులకు విజ్ఙప్తి’లో ప్రథమార్ధం మంచి ఊపులోనే సాగుతుంది. కథను నేరుగా స్పెయిన్‌లో మొదలు పెట్టిన దర్శకుడు మొదటి 20 నిమిషాలు మానసగా ఆషికా రంగనాథ్ అందాల్లో రామసత్యతో పాటు, ప్రేక్షకుడిననీ ముంచేస్తాడు. మానసకు అసిస్టెంటుగా సత్య చేసే కామెడీ ఒకవైపు మెప్పిస్తుంటే… మానస సొగసుల్లో రామసత్య రొమాన్స్ ఆడియాన్ ని ఎంగేజ్ చేస్తాయి. అలా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు… హైదరాబాద్ లో రామసత్య భార్య బాలామణిని చూపించి… పాత్రల మధ్య కాన్ఫ్లిట్ ని రైజ్ చేశాడు. భార్యా భర్తల మధ్యలోకి ప్రేయసి రావడంతో అక్కడి నుంచి హీరో పడే తంటాల మధ్య.. కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను నడిపించడానికి ప్రయత్నించాడు కిషోర్. కానీ ఒక దశ దాటాక కామెడీ వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్లోనే కథపై ఒక అంచనాకు వచ్చిన ప్రేక్షకుడిని తర్వాత ఆకట్టుకోవడం కష్టమైన పని. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. కథ ఇక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగే రెండు మూడు సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయి. డీజే మిక్స్ సాంగ్ అసందర్భంగా అనిపించినా.. అది ప్రేక్షకుల్లో జోష్ తెస్తుంది. ద్వితీయార్ధంలో డంబ్ స్మాష్ ఎపిసోడ్ ఒక్కటి కొంచెం నవ్వించింది. సెకండాఫ్ లో రంగప్రవేశం చేసిన తారక్ పొనప్ప పాత్ర పెద్దగా పండలేదు.
క్లైమాక్స్ లో ఎమోషన్స్ లైట్ టచ్ చేసి… సరదాగా కథను ముగించారు. పతాక సన్నివేశాలు సాధారణంగా అనిపించడంతో సినిమా మీద కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో రవితేజను చూడడం ఈ సినిమాతో అత్యంత రిఫ్రెషింగ్ గా అనిపించే విషయం. ఇద్దరు పెళ్ళాల కథలతో 80 దశకం లో శోభన్ బాబు తో ఇల్లాలు, కార్తీకదీపం, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలు పెద్ద సక్సెస్ లు సాధించాయి. 90వ దశకంలో కూడా ఇలాంటి కథలు చాలానే చూశారు తెలుగు ప్రేక్షకులు. అల్లరి మొగుడు.. ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఆవిడా మా ఆవిడే.. ఇలా ఆ తరహా కథలతో వచ్చిన సినిమాలు చాలానే విజయవంతం అయ్యాయి. అప్పట్లో సొసైటీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న మగాళ్ల సంఖ్య కూడా ఎక్కువ ఉండేది. తర్వాత సమాజం మారింది. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తగ్గింది. కానీ పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలు కొనసాగించే వ్యక్తులకేమీ లోటు లేదనుకోండి ! భార్యను అమితంగా ప్రేమించే భర్త అనుకోకుండా మరో అమ్మాయి ప్రేమలో పడితే? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో పెళ్లి చేసుకుంటే? ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారితే? పైన చెప్పుకున్న పాత కథలనే కొంచెం ట్విస్ట్ చేసి..అందించిన చిత్రమే ‘భర్త మహాశయులకు విజ్ఙప్తి’ కానీ పూర్తి వినోదం స్థాయిని మాత్రం మించలేకపోయింది. అలా అని నిరాశపరచలేదు.. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
