Sahu Garapati: సాహు ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్
తెలుగు నిర్మాత సాహు గారపాటి(Sahu garapati) దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన నిర్మించిన తాజా మలయాళ చిత్రం వాఘా2(Vaazha2) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆయన బ్యానర్ షైన్ స్క్రీన్స్(Shine screens) కింద వచ్చిన ఈ సినిమా, విభిన్న భాషల ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకునే నిర్మాతగా సాహు గారపాటి ప్రతిష్టను మరింత బలపరిచింది. ఈ సక్సెస్ తో ఆయన పేరు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ భారీ సక్సెస్ ఒక్కసారిగా వచ్చింది కాదు. ఇటీవలే మలయాళంలో ఆయన నిర్మించిన వ్యాసనసమేతం బంధుమిత్రదికల్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు మలయాళ హిట్స్ సాధించడం ద్వారా, అక్కడి మార్కెట్‌పై ఆయనకున్న పట్టు స్పష్టమవుతోంది. మంచి కథలను ఎంపిక చేయడంలో ఆయన చూపుతున్న దృష్టి, విభిన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సాహు గారపాటి మల్టీ లాంగ్వేజ్ నిర్మాతగా తన సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు.
తెలుగులో కూడా కిష్కింధపురి(Kishkindhapuri), మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankara varaprasad Garu) లాంటి విజయాలతో ఆయన ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు భాషల పరిమితులను దాటి ముందుకు సాగుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో తన ప్రయాణాన్ని విస్తరిస్తున్నారు. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న సాహు గారపాటి, భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో మరింత పెద్ద స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
