Durandhar2: దురంధర్2లో అన్నపూర్ణ స్టూడియోస్ ఇన్వాల్వ్మెంట్
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు ఇతర భాషా సినిమాలను థియేటర్లలో పెద్ద ఎత్తున చూసే పరిస్థితి పెరిగింది. అయితే డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా కాలంగా ఒక పెద్ద విమర్శ వినిపిస్తూ వస్తోంది. ముఖ్యంగా హిందీ, తమిళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసే సమయంలో సహజంగా మాట్లాడే తెలుగు కాకుండా పుస్తకాలలో ఉండే భాషలా అనిపించే డైలాగులు వినిపిస్తుంటాయి. సాధారణంగా చెన్నై లేదా ముంబైలో స్థిరపడిన తెలుగు రచయితలు ఈ డబ్బింగ్ పనిని చేపట్టడం వల్ల స్థానిక పలుకుబడి, ప్రాంతీయ భావాలు సరిగ్గా ప్రతిబింబించకపోవడం జరుగుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో చాలా డబ్బింగ్ సినిమాల్లో మాటలు సహజంగా అనిపించక ప్రేక్షకులకు కొంత అసహజ భావన కలుగుతోంది.
అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ధురంధర్(durandhar2) సినిమా ఈ విషయంలో భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్, లోకలైజేషన్ బాధ్యతలను హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios)కు అప్పగించారు. ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రేక్షకులు గమనించిన ముఖ్యమైన అంశం డబ్బింగ్ నాణ్యత. ముఖ్యంగా సంజయ్ దత్(Sanjay dutt) పాత్రకు వచ్చిన తెలుగు వాయిస్, అర్జున్ రాంపాల్(Arjun rampal) పాత్ర డైలాగులు మరియు మొత్తం డైలాగ్స్ అసలు భాషలో ఉన్న భావాన్ని అలాగే అందించేలా వినిపిస్తున్నాయి. దీనికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ స్థానిక భాషా శైలిని, సహజమైన తెలుగు పలుకుబడిని ప్రాధాన్యంగా తీసుకోవడమే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇలా లోకల్ టచ్‌తో చేసిన డబ్బింగ్ వల్ల తెలుగు ప్రేక్షకులు సినిమాను మరింత సహజంగా అనుభూతి చెందే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో కూడా పెద్ద బడ్జెట్ హిందీ, తమిళ సినిమాల కోసం ఇలాంటి స్థానిక డబ్బింగ్ విధానాన్ని కొనసాగిస్తారా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ట్రైలర్‌కు వచ్చిన స్పందనను చూస్తే మాత్రం ధురంధర్: ది రివెంజ్ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ సినిమాలు కూడా భారీ విజయాలను అందుకోగలవని ఈ సినిమా మరోసారి నిరూపించబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
