టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక గమనించండి!
కరోనా తర్వాత దేశంలో ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక భద్రత, జీవిత బీమాపై అవగాహన గణనీయంగా పెరిగింది. తమ తదనంతరం కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ ‘టర్మ్ ఇన్సూరెన్స్‘ (Term Insurance) తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు బీమా కంపెనీలు సైతం ఆకర్షణీయమైన పథకాలతో ముందుకొస్తున్నాయి. అయితే కేవలం తక్కువ ప్రీమియం చూసి గుడ్డిగా పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో మీ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన టర్మ్ పాలసీని (Term Insurance) ఎంచుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే..
ఇవి కూడా చదవండి
1. కంపెనీ ఆర్థిక సామర్థ్యం:
టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance) అనేది 25 నుంచి 40 ఏళ్ల పాటు కొనసాగే సుదీర్ఘ ఒప్పందం. కాబట్టి మీరు పాలసీ తీసుకునే సంస్థ భవిష్యత్తులో దివాలా తీయకుండా నిలబడగలిగే సత్తా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. దీనికోసం కంపెనీ ‘సాల్వెన్సీ నిష్పత్తి’ (Solvency Ratio)ని పరిశీలించాలి. నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోవడం సురక్షితం. అప్పుడే అవి భవిష్యత్తులో సమర్థవంతంగా కొనసాగుతాయి.
2. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో:
పాలసీదారుడికి ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే, ఆ కుటుంబానికి బీమా సొమ్ము సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందాలి. అందుకే ఐఆర్డీఏఐ (IRDAI) ఏటా విడుదల చేసే నివేదికల ఆధారంగా, క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి (Claim Settlement Ratio) కనీసం 98 శాతం కంటే ఎక్కువగా ఉన్న సంస్థలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
3. తక్కువ ప్రీమియం వెనుక అసలు నిజం:
చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు కేవలం తక్కువ ప్రీమియం ఉందన్న ఒకే ఒక్క కారణంతో పాలసీని (Term Insurance) ఎంచుకోవడం. చౌక ప్రీమియంను ఆఫర్ చేసే సంస్థలు క్లెయిమ్ సమయంలో అనేక సంక్లిష్ట నిబంధనలు పెట్టి, చెల్లింపులను జాప్యం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రీమియం కంటే పాలసీ అందించే కవరేజీ, ప్రయోజనాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.
4. సంస్థపై ఉన్న ఫిర్యాదుల నిష్పత్తి:
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ (IRDAI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, మీరు ఎంచుకున్న కంపెనీపై వినియోగదారుల నుంచి ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయో పరిశీలించాలి. సగటున ప్రతి 10,000 పాలసీలకు 10 కంటే తక్కువ ఫిర్యాదులు (Grievance ratio) ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ఫిర్యాదులు అంతకంటే ఎక్కువగా ఉంటే ఆ కంపెనీకి దూరంగా ఉండటమే మేలు.
5. డిజిటల్ కస్టమర్ సర్వీస్:
కష్టకాలంలో కుటుంబ సభ్యులను పదేపదే డాక్యుమెంట్ల పేరుతో ఆఫీసుల చుట్టూ తిప్పించుకునే సంస్థలకు దూరంగా ఉండాలి. పాలసీ (Term Insurance) కొనుగోలు దగ్గరి నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు అన్ని ప్రక్రియలను ఆన్లైన్లో (Digital services) అత్యంత సులభంగా, పారదర్శకంగా అందించే మెరుగైన కస్టమర్ సర్వీస్ ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి.
టర్మ్ పాలసీ అనేది కేవలం ఒక కాగితం కాదు, అది మీ కుటుంబానికి మీరు ఇచ్చే ఆర్థిక భరోసా. కాబట్టి ఒకటికి రెండుసార్లు పై అంశాలను బేరీజు వేసుకుని సరైన (Term Insurance) బీమా కంపెనీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి






