ఆ రూల్ మారిస్తే మిడిల్ క్లాస్‌పై వడ్డీ, పన్నుల భారం మాఫీ: ఎస్బీఐ చీఫ్
సొంతిళ్లు అనేది ప్రతి మధ్యతరగతి జీవికి ఒక అతిపెద్ద కల. కానీ, ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు (Home Loans) చూస్తే ఆ కల కల్లగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల కష్టాన్ని గుర్తించిన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన ప్రతిపాదన చేసింది. అదేంటంటే.. మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా ‘అఫర్డబుల్ హౌసింగ్’ నిర్వచనాన్ని తక్షణమే మార్చాలని ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రభుత్వానికి, నియంత్రణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
నిర్వచనం ఎందుకు మార్చాలి?
మెట్రో నగరాలు, టైర్-1 పట్టణాల్లో గత కొన్నేళ్లుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయాయి. దీంతో పాత లెక్కల ప్రకారం ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’ లిమిట్స్ (పెట్టుబడి పరిమితులు, కార్పెట్ ఏరియా నిబంధనలు) సామాన్యులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మార్కెట్ వాస్తవాలకు, ప్రభుత్వ నిబంధనలకు పొంతన లేకుండా పోయింది. అందుకే ప్రస్తుత ధరలకు (Home Loans) అనుగుణంగా ఈ కేటగిరీ పరిమితులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రూల్ మారితే సామాన్యులకు లాభం ఏంటి?
నిబంధనలను సడలించి, ధరల పరిమితిని పెంచితే.. ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే ఇళ్లు ఈ ‘అఫర్డబుల్ హౌసింగ్’ కేటగిరీ కిందకు వస్తాయి. తద్వారా వారికి ప్రభుత్వ గృహ రుణాలపై (Home Loans) వడ్డీ రాయితీలు, అలాగే ఆదాయపు పన్నులో ప్రత్యేక పన్ను మినహాయింపులు లభిస్తాయి. అప్పుడు ఈఎంఐల భారం గణనీయంగా తగ్గి సొంతింటి కల సులభంగా నెరవేరుతుందని శ్రీనివాసులు శెట్టి వివరించారు.
రూ. 51 లక్షలకు చేరిన సగటు హోమ్ లోన్!
మార్కెట్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఎస్బీఐ వద్ద ఉన్న తాజా గణాంకాలే నిదర్శనం. గతంలో ఒక సగటు మధ్యతరగతి కుటుంబం తీసుకునే హోమ్ లోన్ (Home Loans) పరిమాణం రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా రూ. 51 లక్షలకు చేరుకుందని ఆయన వెల్లడించారు. ఇది కేవలం ప్రాపర్టీ ధరల పెరుగుదలను మాత్రమే సూచించడం లేదని, మారుతున్న ప్రజల జీవనశైలిని, విశాలమైన, మెరుగైన సౌకర్యాలున్న గృహాల కోసం వారు వెచ్చిస్తున్న ఖర్చును తెలియజేస్తోందని విశ్లేషించారు.
రికార్డు స్థాయిలో లోన్లు
ధరల మంట, వడ్డీ రేట్ల భారం ఉన్నప్పటికీ భారతీయుల్లో ఇళ్లు కొనే ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఎస్బీఐ లోన్ బుక్ వృద్ధి (Home Loans) సాక్ష్యంగా నిలుస్తోంది. గతేడాదితో పోలిస్తే బ్యాంక్ దేశీయ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 13.66 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి, ఏకంగా రూ. 8.6 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. మరి బ్యాంకింగ్ దిగ్గజం చేసిన ఈ కీలక సూచనను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం సామాన్యుల ఇంటి కలకు ఊతమిస్తుందేమో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి






