TCS: టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాల కోత… సుమారు 12 వేల మంది ఉద్యోగులపై

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీస్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం లో తన సిబ్బంది(Staff)ని 2 శాతం మేర తగ్గించుకోనున్నట్టు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ సంస్థ వర్క్‌ఫోర్స్ (Workforce) లో 2 శాతం అంటే.. 12,200 మందికి పైగానే (మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధ (Artificial intelligence) కారణంగా సాంకేతిక పరిజ్ఞానాలు మారుతున్న నేపథ్యంలో వ్యాపార గిరాకీ తగ్గిపోతుండడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ (TCS) భవిష్యత్తు పరిణామాలకు సిద్ధంగా ఉండే సంస్థగా మారే ప్రయాణంలో ఉంది. ఆ ప్రయాణంలో భాగంగా, సంస్థకు ఉపయోగపడని ఉద్యోగులను ఏడాది వ్యవధిలో తొలగిస్తాం. ఈ ప్రభావం మా అంతర్జాతీయ సిబ్బందిలో 2 శాతం మందిపై, ముఖ్యంగా మధ్య స్థాయి, సీనియర్ గ్రేడ్ (Senior grade) ఉద్యోగులపై పడుతుంది అని ఆ సంస్థ తన ప్రకటనలో వివరించింది. టీసీఎస్ సేవలను పొందేవారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా, తమ సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా, ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రచించినట్టు వెల్లడించింది.