Gautam Adani: అదానీకి సెబీ క్లీన్ చిట్

అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ (Gautam Adani) ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా తోసిపుచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని పెట్టుబడులు, మార్కెట్ల రెగ్యులేటర్ క్లీన్‌చిట్ ఇచ్చింది. అదానీపై హిండెన్‌బర్గ్ (Hindenburg) ఆరోపణలు నిరూపణ కాలేదు. అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఆ సంస్థపై జరిమానా విధించాల్సిన అవసరం లేదు అని సెబీ హోల్ టైం మెంబర్ కమలేష్ చంద్ర వర్షనేరు తన ఆర్డర్‌లో పేర్కొన్నారు. దీంతో అదానీ పోర్ట్స్, అదానీ పవర్, గౌతమ్ అదానీ, రాజేష్ అదానీ (Rajesh Adani)లపై కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాలను సెబీ రద్దు చేసినట్లయ్యింది.
గౌతం అదానీ అవినీతిని కీలక ఆధారాలతో 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, సాక్ష్యాలను సంపాదించామని, దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్ట్‌లో పొందుపర్చామని అప్పట్లో హిండెన్‌బర్గ్ పేర్కొంది. అప్పటి సెబీ చైర్‌పర్సన్ మాధాబి పురీ బుచ్‌కు అదానీ గ్రూపు సంస్థలతో ఉన్న అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం బయటపెట్టిన విషయం తెలిసిందే.