Jonnagiri: కర్నూలులో స్వర్ణయుగానికి నాంది..జొన్నగిరిలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్..

ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో, దేశవ్యాప్తంగా గోల్డ్ మైనింగ్ పై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో బంగారు గని ప్రాజెక్టు ప్రారంభం కాబోతోందన్న వార్త పెద్ద చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా (Kurnool) జొన్నగిరి (Jonnagiri) గ్రామంలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చెయ్యబడుతున్న తొలి గోల్డ్ మైన్‌గా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టును జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Geo Mysore Services India Pvt Ltd) అభివృద్ధి చేస్తోంది.
ఈ ప్రాజెక్టు సుమారు 1,477 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగనుంది. గనులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశల్లో విస్తరించి ఉండటం ప్రత్యేకత. నిపుణుల అంచనా ప్రకారం ఇక్కడ దాదాపు 11.2 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గనుల ఉత్పత్తి కనీసం 8 నుండి 15 సంవత్సరాల పాటు సాగవచ్చని చెబుతున్నారు. ప్రాజెక్టులో డెక్కన్ గోల్డ్ మైన్స్ (Deccan Gold Mines) 40% వాటా కలిగి ఉండగా, త్రివేణి ఎర్త్ మూవర్స్ (Triveni Earth Movers) 60% వాటా కలిగి ఉన్నారు.
ఈ ప్రాజెక్టు ప్రయాణం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. 2006లో జియో మైసోర్ ఈ గనుల లీజు కోసం దరఖాస్తు చేసుకోగా, 2008లో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (Indian Bureau of Mines) మైనింగ్ ప్లాన్‌ను ఆమోదించింది. తరువాత 2010లో పర్యావరణ శాఖ నుండి అనుమతి లభించింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో 33 వేల మీటర్ల డ్రిల్లింగ్, ఐపీ సర్వేలు, మాగ్నెటిక్ సర్వేలు నిర్వహించబడాయి. దీంతో 2043 వరకు ఈ ప్రాజెక్టు చెల్లుబాటు అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ (Ministry of Environment and Forests) కూడా దీని కోసం అనుమతి మంజూరు చేసింది.
ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదట 400 కిలోల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పుడు వార్షిక ఉత్పత్తిని 750 కిలోల వరకు పెంచాలని భావిస్తోంది. దీనితో ప్రాజెక్ట్ ప్రారంభమైన వెంటనే రూ.350 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమాచారం వెలువడగానే డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు ఒక్కసారిగా 14% పెరిగాయి.
ఈ గని ప్రారంభం కేవలం ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాకుండా, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతుందని భావిస్తున్నారు. స్థానిక అభివృద్ధికి కూడా ఇది దోహదం చేయనుంది. నిపుణుల అంచనాల ప్రకారం, గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం అవడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరపడే అవకాశం ఉంది. మొత్తానికి జొన్నగిరి బంగారు ప్రాజెక్టు దేశంలో ప్రైవేట్ రంగానికి ఒక కొత్త దారిని చూపించబోతోంది.