Banks: పెద్దోళ్లకు ఒక న్యాయం… పేదోళ్లకు మరో న్యాయం…!!

భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో (Banking System) అనేక అసమానతులున్నాయి. బ్యాంకుల ద్వంద్వ విధానాలపై ఎంతోకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు, ధనవంతుల పాలిట మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనో ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి (T. Subbirami Reddy) నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ (Gayatri Projects) దివాలా నేపథ్యంలో బ్యాంకుల పనితీరుపై మరోసారి చర్చ జరుగుతోంది. వేల కోట్ల రూపాయలను గాయత్రి ప్రాజెక్ట్స్ కు మాఫీ చేసేసిన బ్యాంకులపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్.. రోడ్లు, రైల్వేలు, సాగునీటి ప్రాజెక్టులు, గనులు వంటి రంగాల్లో పేరొందింది. 1989లో స్థాపించిన ఈ సంస్థకు సుబ్బరామి రెడ్డి కుటుంబం ప్రమోటర్లుగా ఉంది. సుబ్బరామి రెడ్డి కాంగ్రెస్ మాజీ మంత్రి. సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. ఆయన భార్య టి.ఇందిరా రెడ్డి చైర్మన్ గా, కుమారుడు టి.వి.సందీప్ కుమార్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2019లో కంపెనీ టర్నోవర్ రూ. 3,463 కోట్లు. నెట్‌వర్త్ రూ. 1,329 కోట్లు. కానీ, కోవిడ్ తర్వాత కంపెనీ నష్టాలబాట పట్టింది. 2021 సెప్టెంబర్ నాటికి కంపెనీ బ్యాంకులకు రూ. 5,917 కోట్ల అప్పు తేలింది. 2022 నవంబర్‌లో NCLT (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్, SBI పిటిషన్ మేరకు దివాలా ప్రొసీడింగ్స్ (CIRP) ప్రారంభించింది. SBIకి రూ. 242 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 1,382 కోట్లు, కెనరా బ్యాంక్ కు రూ. 1,911 కోట్లు డిఫాల్ట్ గా తేలింది. ఈ మొత్తం విలువ గ్యారంటీలతో కలిపి రూ. 9,150 కోట్లుగా నిర్ధారణ అయింది.
ప్రమోటర్లు 2015 నుంచి డెట్ రీస్ట్రక్చరింగ్ ప్రతిపాదించారు. కానీ వర్కవుట్ కాలేదు. 2023లో EOI పిలిచారు, కానీ బిడ్‌లు తక్కువగా వచ్చాయి. 2024 జనవరిలో బ్యాంకులు లిక్విడేషన్ పిటిషన్ దాఖలు చేశాయి. మార్క్ AB క్యాపిటల్ రూ. 650 కోట్ల బిడ్ ప్రతిపాదించింది. ఇప్పుడు NARCL రూ. 474 కోట్లు ఆఫర్ చేసింది. ఇది మొత్తం డెట్‌కు కేవలం 5% రికవరీ మాత్రమే! ప్రమోటర్లు రూ. 750 కోట్ల OTS (వన్-టైమ్ సెటిల్‌మెంట్) ప్రతిపాదించారు. ఇది 8% రికవరీ. ప్రమోటర్లు NCLTలో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసి, ఆర్బిట్రేషన్ అవార్డు రూ. 850 కోట్లను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు. చివరగా గాయత్రి ప్రాజెక్ట్స్ మొత్తం అప్పులు రూ. 8,100 కోట్లు కాగా బ్యాంకులు రూ. 2,400 కోట్లతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రూ. 5,700 కోట్ల రూపాయలను మాఫీ చేసేందుకు అంగీకరించాయి.
బ్యాంకుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు క్రెడిట్ కార్డ్ బిల్ ఒక రోజు ఆలస్యంగా కడితేనే వంద కాల్స్ చేస్తారు కానీ పెద్దోళ్లు కానీ వేల కోట్లు ఎగ్గొడితే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. పేదల సేవింగ్స్‌లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ కట్టించుకుంటారు. కానీ పెద్దలకు NPA వైట్-ఆఫ్ చేస్తారు. ఇదేం న్యాయం? అని మరొకరు ప్రశ్నించారు. మన డబ్బులతో పెద్దోళ్లను మేపుతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.