ఆర్బీఐ గుడ్ న్యూస్!
గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ వడ్డీ రేట్ల విధానంలోకి మారే అవకాశం తీసుకురానుంది. దీనికి సంబంధించి ఓ ప్రేమ్ వర్క్‌ను తీసుకొస్తామని తెలిపింది. కేవలం హోమ్‌లోన్ కస్టమర్లే కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారు ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ఎంపీసీ భేటీ నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రెగ్యులేటెడ్ బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాలవ్యవధిని సవరిస్తుంటాయి. ఈ విషయంలో రుణ గ్రహీతకు ఎలాంటి సమాచారం ఇవ్వవు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇదే విషయాన్ని తాము చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడించారని ఆర్బీఐ తెలిపింది. ఫ్లోటింగ్ వడ్డీ విధానంలో బ్యాంకులు తమ వద్ద నుంచి ఎలాంటి సమ్మతి లేకుండానే నిర్ణయం తీసుకుంటున్నాయని వారు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొంది. దీనికి పరిష్కారంగా ఆయా ఆర్థిక సంస్థలు అమలు చేసే విధంగా ఓ ప్రైమ్వర్క్ను తీసుకురాబోతున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.






