అంతరిక్ష పోటీలో..
చంద్రయాన్-3 విజయంతో ఇస్రో కీర్తిప్రతిష్టలు.. విశ్వవ్యాప్తమయ్యాయి. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రుడిపై కాలుమోపిన దేశంగా భారత్ వినుతికెక్కింది. మరీ ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. దీనికి తోడు అత్యంత చౌకైన ప్రయోగాలతో .. అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ దేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. దీంతో అంతరిక్ష వ్యాపారంలో అగ్రరాజ్యాలకు ఇస్రో గట్టిపోటీ ఇవ్వనుంది.
శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి విదేశీ అంతరిక్ష పరిశోధన సంస్థలకు అయ్యే ఖర్చులో మూడో వంతుతోనే ఇస్రో పని ముగించగలుగుతుండడంతో పలు దేశాలు తమ ఉపగ్రహ ప్రయోగాలకు భారత్‌కే క్యూ కడుతున్నాయి. ఫలితంగా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ నానాటికీ పెరుగుతోంది. చంద్రయాన్-3 సక్సెస్ తో.. ఉపగ్రహ ప్రయోగాల కోసం మన దేశానికి వచ్చే దేశాల సంఖ్య.. తద్వారా మన అంతరిక్ష మార్కెట్ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.66 వేల కోట్లుగా ఉన్న ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ 2025 నాటికి 13 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. అంటే రూ.లక్ష కోట్లకు పైమాటే. 2040 నాటికి అది 100 బిలియన్ డాలర్లకు.. అంటే రూ.8.25 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్థర్ డి లిటిల్’ అంచనా వేసింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తుండగా.. మన అంతరిక్ష మార్కెట్ విలువ 40 శాతం మేర పెరుగుతూ వస్తోంది. 2021 నాటికి దాదాపు రూ.31 లక్షల కోట్లుగా ఉన్న ప్రపంచ అంతరిక్ష రంగ మార్కెట్ విలువ.. 2040 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు అంటే దాదాపుగా రూ.82.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ, సిటి, యూబీఎస్ వంటి సంస్థలు అంచనా వేశాయి.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవడంలో నాసా విధానాలనే అనుసరించాలని భారత్ భావిస్తోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్‌షిప్ రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థలు అస్ర్టోబోటిక్, ఇంట్యూటివ్ మెషీన్స్ కూడా లూనార్ ల్యాండర్లను రూపొందించే పనిలో ఉన్నాయి. 2021 మే నాటికి భారత్‌లో 368 స్పేస్ టెక్ కంపెనీలున్నాయి. అమెరికా, యూకే, కెనడా, జర్మనీ తర్వాత.. ఇన్ని ప్రైవేటు స్పేస్ టెక్ కంపెనీలు ఉన్న దేశం మనదే.
అంతరిక్ష రంగంలో భారతవిజయాలు.. కేవలంవ్యాపారం పరంగానే కాదు.. రక్షణపరంగానూ అక్కరకొస్తాయి. లాంగెస్ట్ రేంజ్ క్షిపణుల నుంచి అత్యాధునిక పరికరాల తయారీరంగంలోనూ భారత్ తనదైన ముద్ర వేయగలుగుతుంది. ఫలితంగా దేశ రక్షణరంగం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే మేకిన్ ఇండియాతో దూసుకుపోతున్న భారత్.. మరింతగా పరిశోధనలపై దృష్టి సారించనుంది. చంద్రయాన్ -3 విజయంతో ఆదిత్య ప్రయోగంపై ఇస్రో మరింత దృష్టిపెట్టనుంది. తర్వాత మంగళయాన్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.






