పేటీఎంకు మరో షాక్.. మార్చి 15లోగా

టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐహెచ్‌ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వాత నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖాతాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు.