మైక్రోసాఫ్ట్ లో మరో భారతీయునికి ఉన్నత స్థానం
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో కీలక నాయకత్వం మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే మరో భారతీయునికి సంస్థలో ఉన్నత స్థానం లభించింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీవో)గా పవన్ దవులూరి నియమితులయ్యారు. ఈయన నేరుగా కంపెనీ సీఈవో సత్యా నాదెళ్లకు రిపోర్టింగ్ చేస్తారు. సత్యా నాదెళ్ల తెలుగువారన్న విషయం తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్ సీపీవోగా ఇప్పటిదాక ఉన్న పనోస్ పనయ్ స్థానంలో పవన్ వస్తున్నారు. అమెజాన్‌కు వెళ్తున్న పనయ్ అక్కడ అలెక్సా, ఎకో ప్రొడక్ట్స్ విభాగాలకు నాయకత్వం వహించనున్నారని బ్లూంబర్గ్ నివేదిక ఒకటి చెప్తున్నది. ఈ విభాగాలకు చీఫ్‌గా ఉన్న డెవిడ్ లింప్ ఈ ఏడాది పదవీ విరమణ పొందుతుండటంతో పనయ్తో ఆ స్థానాన్ని అమెజాన్ భర్తీ చేస్తున్నది. త్వరలో మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇన్నోవేషన్స్‌ను ఆవిష్కరించనుండగా, ఈ తరుణంలో బాధ్యతలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
పవన్ దవులూరి ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని తీసుకున్నారు. ముంబైలో జన్మించిన ఈయనకు మైక్రోసాఫ్ట్‌తో 22 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నది. 2021లో కంపెనీలో రిలయబిలిటీ కంపోనెంట్ మేనేజర్‌గా చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీవో స్థాయికి చేరుకున్నారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడిగా ఉండటం గమనార్హం.






