ఇన్ఫోసిస్ గొప్ప నిర్ణయం.. వారి కోసం రూ.100 కోట్లు
ప్రముఖ విద్యా సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్)లో ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్న ఆర్థికంగా బలహీన వర్గాల్లోని విద్యార్థినులను స్టెమ్ స్టార్స్ ఉపకార వేతనాలు ఇచ్చేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఇన్ఫోసిస్ దాతృత్వ విభాగమైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. తొలి విడతలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళాశాలల్లో సీట్లు పొందిన 2,000 మంది విద్యార్థినులకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ అందివ్వనుంది. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్స్ కోసం మొత్తంగా ఏటా రూ. 1 లక్ష వరకు వీరికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. దేశంలో పేద కుటుంబాల్లోని యువత తాము కోరుకున్న ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారు. ఈ ప్రభావం బాలికలపై మరింత ఎక్కువగా ఉందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మానీ తెలిపారు. స్కాలర్షిప్ ప్రారంభ సంవత్సరంలో ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్) గుర్తింపు ఉన్న విద్యాలయాలు` ఐఐటీలు, బిట్స్ పిలానీ, నిట్, ప్రసిద్ధ వైద్య కళాశాలల్లో చదివే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది.






