Shailesh Jejurikar : పీ అండ్ జీ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి

మరో ప్రముఖ బహుళజాతి కంపెనీకి భారతీయుడు సారథ్యం వహించనున్నారు. అమెరికన్ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శైలేష్ జెజురికర్ (Shailesh Jejurikar) నియమితులయ్యారు. 58 ఏళ్ల జెజురికర్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. 1989లో ఈ కంపెనీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేరిన శైలేష్, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గత ఆరేళ్లుగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ లిఫ్ట్‌ల తయారీ సంస్థ ఓటిస్ ఎలివేటర్స్ కంపెనీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. నాయకత్వ మార్పులో భాగంగా పీ అండ్ జీ ప్రస్తుత సీఈఓ జాన్ మోల్లెర్ (John Moller) స్థానంలో శైలేష్ నియ మితులయ్యారు. ఈ అక్టోబరులో జరగనున్న వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ పదవికి పోటీ చేసేందుకు సైతం కంపెనీ బోర్డు జెజురికర్‌ను నామినేట్ చేసినట్లు పీ అండ్ జీ తెలిపింది.
శైలేష్ జెజురికర్‌కు హైదరాబాద్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School ) లో చదువుకున్నారు. అంతేకాదు, హెచ్‌పీఎస్‌లోనే చదువుకున్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల (Satya Nadella) క్లాస్‌మేట్ కూడా. వీరిద్దరూ స్నేహితులని కూడా తెలిసింది. జెజురికర్, నాదెళ్లతోపాటు వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మాజీ సీఈఓ అజయ్ బంగా (Ajay Banga) , అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ కూడా హెచ్‌పీఎ్‌స పూర్వ విద్యార్థులే.