టైమ్స్ జాబితాలో భారతీయులు
టైమ్స్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన వంద మంది ప్రపంచ ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో ముగ్గురు భారతీయులతో పాటు భారత సంతతి వ్యక్తి ఒకరు చోటు దక్కించుకున్నారు. మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాత్రికేయురాలు నందితా వెంకటేశన్, ఆర్కిటెక్ట్ వినుడానియల్, శాస్త్రవేత్త నాబరన్ దాస్ గుప్తాల కృషిని, సమాజానికి వారు సేవలను మ్యాగజీన్ కొనియాడింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34) తన దూకుడైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులను గెలుచుకున్నారని, మహిళలకు క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగేలా చేశారని పేర్కొంది.
క్షయ వ్యాధిని ఎదుర్కొన్న నందితా వెంకటేశన్ చికిత్స సమయంలో మిశ్రమ మందుల వినియోగంతో తన వినికిడి శక్తిని కోల్పోయారు. ఆమె తన మాదిరే వినికిడి శక్తిని కోల్పోయిన దక్షిణాఫ్రికాకు చెందిన పుమెజా టిసీలీతో కలిసి సంయుక్తంగా టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఓ ఔషధ కంపెనీకి క్షయ వ్యాది మందులకు సంబంధించి రెండోసారి పేటెంట్‌ను ఇవ్వొద్దని కోరుతూ నందితా, టిసిలీతో కలిసి భారత ప్రభుత్వానికి పిటిషన్ సమర్పించారు. ఈ కృషిలో విజయం సాధించడం ద్వారా క్షయ వ్యాధిగ్రస్థులకు తక్కువ ధరకే మందులు లభిస్తున్నాయి. విను డానియల్ తన వాల్ మేకర్స్ స్టూడియో ద్వారా ప్రాకృతిక ఇళ్లను నిర్మిస్తున్నారు. మట్టి, వ్యర్థ పదార్థాలతో సౌకర్యవంతమైన, ఆకర్షణీయ నిర్మాణాలు చేపడుతున్నారు. సిమెంటు, కాంక్రీటుతో చేపట్టే నిర్మాణాల కోసం ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత సంతతి శాస్త్రవేత్త నాబరన్ దాస్‌గుప్తా తన సంస్థ ద్వారా ఓపియాడ్ డ్రగ్ అధిక వినియోగంతో సంభవిస్తున్న మరణాలను నిలువరించేందుకు పోరాడారు.






