Aurobindo Pharma:అరబిందో ఫార్మా మరో భారీ కొనుగోలు..రూ.2,185 కోట్లతో

ప్రముఖ ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా (Aurobindo Pharma) మరో భారీ కొనుగోలు జరిపింది. అమెరికాకు చెందిన లానెట్ సెల్లర్ హోల్డ్‌కో (Lanette Seller Holdco) నుంచి లానెట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీని 25 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2,185 కోట్లు) చేజిక్కించుకుంది. అరబిందో ఫార్మా తన పూర్తి అనుబంధ విభాగమైన అరబిందో ఫార్మా యూఎస్‌ఏ (USA )ఇంక్ ద్వారా ఈ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలో తయారీ సామర్థ్యంతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోలు జరిపినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలో ట్రెవోస్ కేంద్రంగా ప్రారంభమైన లానెట్, అత్యంత నాణ్యమైన, కాంప్లెక్స్ జనరిక్ ఔషధాల ఉత్పత్తిదారు. ముఖ్యంగా ఏడీహెచ్‌డీ (ADHD) చికిత్సలో ఉపయోగించే జనరిక్ లిక్విడ్‌ను తయారు చేస్తోందీ సంస్థ. ఇండియానాలో ఏటా 360 కోట్ల ట్యాబ్లెట్లను తయారు చేయగలిగే భారీ ప్లాంట్‌ను సైతం కలిగి ఉంది. ఈ డీల్ ద్వారా లానెట్‌కు చెందిన అత్యంత లాభదాయక ఔషధాల పోర్ట్‌ఫోలియోతోపాటు కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీడీఎంఓ) వ్యాపారంలోకి అరబిందోకు ప్రవేశం లభించనుంది.