యాపిల్ కీలక నిర్ణయం
ఐఫోన్ 12 రేడియేషన్ పై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఐఫోన్ 12 ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామని హామీ ఇచ్చింది. తద్వారా అధిక రేడియేషన్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. అయితే, ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ వాడుతున్న యూజర్లకు మాత్రమే అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తద్వారా ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ల విక్రయాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఐఫోన్ 12 నుంచి అధిక రేడియేషన్ వెలువడుతోందంటూ ఫ్రాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేడియేషన్ స్థాయుల విషయంలో యూరోపియన్ యూనియన్ నిబంధనలను ఈ ఫోన్ ఉల్లంఘిస్తోందని తెలిపింది. దీంతో వెంటనే వీటి విక్రయాలను నిలిపివేయాలని యాపిల్‌ను ఆదేశించింది. ఫలితంగా ఇతర ఐరోపా దేశాల్లోనూ ఈ ఫోన్‌పై ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలోనే ఆ మోడల్‌కు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వాలని యాపిల్ నిర్ణయించింది. తద్వారా ఐరోపా సమాఖ్య నిబంధనలను అనుగుణంగా రేడియేషన్ స్థాయిలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఇది భద్రత లోపం ఏమాత్రం కాదని, కేవలం ఫ్రాన్స్ టెస్టింగ్ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగానే అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.






