ఐఫోన్ లకు కొత్త భద్రతా అప్డేట్
ఐఫోన్లు, ఐప్యాడ్ల కోసం ముఖ్యమైన భద్రతా అప్డేట్ను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ల సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతాపరమైన లోపాలను నివారించడం కోసం కొత్త ప్యాచ్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోస్ సిటిజన్ ల్యాబ్‌లో పరిశోధకులు ఈ లోపాలను గుర్తించారు. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు చెందిన పెగాసస్ సాఫ్ట్వేర్ ఐఫోన్లోకి చొప్పించే ప్రయత్నంలో ఈ లోపాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలపై నిఘా ఉంచేందుకు అత్యంత ఖరీదైన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారని, కాబట్టి సామాన్య వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐఫోన్ వినియోగదారులు తక్షణమే పరికరాలను అప్డేట్ చేసుకోమని సిటిజన్ ల్యాబ్ సూచిస్తోంది.






