Iran : ఇరాన్- అమెరికా తదుపరి అణు చర్చలు రోమ్‌లో

ఇరాన్ (Iran) అణుకార్యక్రమంపై తదుపరి చర్చలకు ఇటలీ రాజధాని రోమ్ వేదిక కానుంది. టెహ్రాన్, వాషింగ్టన్ (Washington) మధ్య జరిగిన తొలి విడత చర్చలకు ఒమన్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి రెండో విడత చర్చలు రోమ్ (Rome)లో జరగనున్నాయని ఇటలీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. చర్చల్లో మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్న ఒమన్ (Oman) నుంచి విజ్ఞప్తి అందింది. మేం సానుకూలంగా స్పందించాం. స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం అని ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో తజానీ (Antonio Tajani) తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధ్యక్షుడు రఫేల్ మారియానో గ్రాసీ టెహ్రాన్ వెళ్లనున్నారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశమవుతారు.