Donald Trump : ట్రంప్ హత్యకు కుట్ర.. తెలిసిందని తల్లిదండ్రుల కాల్చివేత!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )ను హత్య చేసేందుకు తాను పన్నిన కుట్రను తెలుసుకున్నారని తల్లిదండ్రులనే ఓ యువకుడు హతమార్చిన ఘటన అమెరికాలో రెండు నెలల క్రితం చోటుచేసుకుంది. విస్కాన్సిన్ (Wisconsin) లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్ (Nikita Kasap).. గత ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా (Tatiana), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అక్కడే కొన్ని వారాల పాటు నివసించాడు. ఆ తర్వాత 14 వేల డాలర్ల నగదు, పాస్‌పోర్టు (Passport) ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హత్య విషయాన్ని కనుగొన్నారు. దీంతో గత నెల కాన్సస్ (Kansas) లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతే కాదు అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది.