వచ్చే అధ్యక్ష ఎన్నికలపై గురి.. భారత్‌ను అదే పనిగా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను అదే పనిగా కీర్తిస్తున్నారు. భారత్, అమెరికా గొప్ప స్నేహ దేశాలని ఆయన గుర్తు చేస్తున్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి గెలిచి, రెండవ సారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలన్నది ట్రంప్ యోచన. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే భారత్ పల్లవి అందుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అమెరికాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడమే. భారత్, అమెరికా మంచి స్నేహితులు అని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు తన కంటే గొప్ప ఫ్రెండ్ మరొకరు లేరని, అమెరికా అధ్యక్షుల్లోనే భారత్‌కు మంచి స్నేహితుడిని తానేనని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
మోదీకి తాను మంచి స్నేహితుడినని కూడా ట్రంప్ తెలిపారు. నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీతో స్నేహంగా మెలిగారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి ఆయన చర్యలు కూడా తీసుకున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో 2019లో ట్రంప్ తో పెద్ద బహిరంగ సభలో మోదీ పాలు పంచుకున్నారు. అలాగే ఆ తరువాత ట్రంప్ సైతం 2020లో అహ్మదాబాద్‌లో మోదీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.






