Vijay Sai Reddy: ఒక కాలు ఇక్కడా… ఒక కాలు అక్కడా… చివరికి ఎక్కడ నిలుస్తావు సాయి రెడ్డి?
వైసీపీ (YCP) మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి (Vemurubakam Vijayasai Reddy) మళ్లీ ఏ రాజకీయ దిశలో నడవబోతున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన భవిష్యత్ నిర్ణయం పై స్పష్టత లేకపోవడం అనవసరమైన గందరగోళానికి కారణమవుతోంది. ఒక వైపున వైసీపీలోకి తిరిగి రావాలనుకుంటున్నారా? మరో వైపున జనసేన (Janasena) దిశగా అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలే చర్చల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
విజయసాయిరెడ్డి స్వభావం ప్రకారం ఆయన ఎప్పుడూ ప్లాన్ చేసి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అందుకే ఇటీవల ఆయన శ్రీకాకుళం (Srikakulam) లో జరిగిన రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమానికి హాజరుకావడం సహజంగా కాకుండా, ఏదో రాజకీయ ఉద్దేశం ఉన్న చర్యగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి ఆయన వెళ్లడం ఒక కూటమిలోని ప్రముఖ నాయకుడి ఆహ్వానం మేరకేనని టాక్. అయితే ఈ చిన్న విషయమే పెద్ద చర్చకు కారణమైంది.
ఈ కార్యక్రమంలో ఇచ్చిన సమాధానాలు ఆయన రాజకీయ గమ్యం ఇంకా నిర్ణయించబడలేదన్న సంకేతాలు ఇస్తున్నాయి. వైసీపీలోకి తిరిగి వెళ్లే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన “ఇది ఊహాజనిత ప్రశ్న” అని తప్పించుకున్నారు. నిజంగా తిరిగి వెళ్లే ఆలోచన లేకుంటే ఆయన నేరుగా కాదు అని చెప్పేవారు. కానీ ఆయన అలా చేయకపోవడం వైసీపీపై ఇంకా ఆసక్తి ఉందా? అనేది ప్రశ్నగా మిగిలింది. అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చుట్టూ కోటరీ ఉందని చెప్పడం ఆయన పార్టీ పట్ల ఉన్న అసంతృప్తిని బయటపెట్టినా, తిరిగి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా మూసివేయనట్టుగానే కనిపిస్తోంది.
ఇక మరో వైపున ఆయన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో గత ఇరవై సంవత్సరాల అనుబంధాన్ని గుర్తుచేసి, ఎప్పుడూ పవన్ గాని జనసేన గాని విమర్శించలేదని చెప్పడం కూడా రాజకీయంగా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న ప్రత్యామ్నాయాల్లో బీజేపీ (BJP) అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పైగా సెంట్రల్ లో బిజెపి బలంగా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం టీడీపీ (TDP) ,జనసేన హవా ఎక్కువగా ఉంది.టీడీపీలోకి వెళ్లడం సాధ్యం కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఫలితంగా జనసేనే ఆయనకు చేరువైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. కానీ అక్కడ ఆయన స్థాయికి సరిపోయే స్థానం ఇస్తారా అన్నది మరో ప్రశ్న.
మొత్తానికి విజయసాయిరెడ్డి ఏ దిశగా వెళ్లాలని నిర్ణయించుకుంటారో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఒక్క మాట – రెండు పార్టీల దిశలో సంకేతాలు – ఈ మూడు కలిపి రాజకీయ వేదికపై అనవసరమైన ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తీసుకునే నిర్ణయం ఏదైనా, అది రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపడం మాత్రం ఖాయం.






