New Couples: కొత్త జీవిత భాగస్వామి అమెరికా వెళ్లడానికి ఎన్ని కష్టాల్లో!

అమెరికాలో ఉండేవారిని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్లాలని ఆశించే వారికి అగ్రరాజ్యంలో కష్టాలు తప్పేలా లేవు. ఆ దేశ పౌరుడు, గ్రీన్ కార్డుదారుడిని (Green card) పెళ్లి చేసుకున్నవారు అంత తేలిగ్గా తమ కొత్త జీవిత భాగస్వామి దగ్గరకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలోలా తేలిగా ఉండే ఇంటర్వ్యూలు (Interviews), అనుమతుల సమయంలో ఇక ముగిసిపోయినట్లే. అక్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ (Trump) సర్కారు ప్రతి కేసునూ సునిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికితోడు వెయిటింగ్ పీరియడ్ ఉండనే ఉంది. అమెరికా పౌరుడి జీవిత భాగస్వామి భారత్‌లో ఉంటే, స్థానిక కాన్సులేట్ అధికారుల ఇంటర్వ్యూను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కఠనంగానే ఉండనుది. అదే ఇప్పటికే భాగస్వామి అమెరికా హెచ్-1బీ వర్క్ వీసా (H-1B work visa )పై ఉంటే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు వీసాను పొందాలంటే ఫాం-ఐ130 అనుమతి పొందడానికి 14 నెలల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత 3 నుంచి 5 నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ప్రక్రియంతా ముగియడానికి 17 నుంచి 20 నెలల సమయం తీసుకోవచ్చు.