Silica Nandhra:సిలికానాంధ్ర మరో సంచలనం…మహిళలతో నూతన కార్యవర్గం

మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న సిలికానాంధ్ర సంస్థ మరో సంచలనం సృష్టించింది. సిలికానాంధ్ర 2025-2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని మహిళలతోనే ప్రకటించి సంచలనం సృష్టించారు. తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటంపై ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షురాలిగా సత్యప్రియా తనుగుల (Satyapriya Tanugula) , ఉపాధ్యక్షురాలిగా శిరీష కలేరు (Sirisha Kaleru) , కోశాధికారిగా మాధవి కడియాల, కార్యదర్శిగా రామ సరిపల్లె, సంయుక్త కార్యదర్శిగా ఉష మాడభూషిలు బాధ్యతలు స్వీకరించారు. వీరందరూ అనేక సంవత్సరాలుగా సంస్థకు సేవలందిస్తూ సాంస్కృతిక మహోత్సవాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వారి కృషి, దృష్టి, నాయకత్వం సమాజంపై సిలికానాంధ్ర ప్రభావాన్ని వ్యాప్తిచేయగా, ఇప్పుడు సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ (Kuchibhotla Anand) ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గానికి కూచిభొట్ల శాంతి, రాజు చమర్తి, దిలీప్ కొండిపర్తి తదితరులు అభినందనలు తెలిపారు.