US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)… అగ్రరాజ్య పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలోని పలు విభాగాలు, పాలనాపరమైన అంశాల్లో సైతం అనేక మార్పులు చేస్తున్నారు. తాజాగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ (Department of War)గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ పేరుతో మంత్రిత్వ శాఖ ఉండగా.. 1947 క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ పేరును అగ్రరాజ్యం తొలగించింది. మళ్లీ దానిని పునరుద్ధరిస్తూ.. పెంటగాన్ పేరు మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యారు.
రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలిచినట్లుగానే ఇకపై ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అని పిలుద్దాం. అది ఎంతో శక్తిమంతమైన పదం. అదే శక్తితో గతంలో అమెరికా మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో విజయం సాధించింది. ప్రతి విషయంలోనూ ముందంజలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దాం’’ అని ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో మాట్లాడారు. దీనికి ట్రంప్ పాలకవర్గ సభ్యులు కూడా మద్దతునిచ్చారు. దీంతో ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది.
1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. యూఎస్ సైనిక, నావికా దళాలకు నాయకత్వం వహించేందుకు ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. అనంతరం 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం.. క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ‘జాతీయ సైనిక సంస్థ’ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను రూపొందించారు. 1949లో సైన్యంలోని త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ.. జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణ శాఖ (US Defence Department)గా మార్చారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ మంత్రిగా పీట్ హెగ్సెత్ (Pete Hegseth) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.