Nara Lokesh: మోదీ-లోకేశ్ భేటీ: ఆత్మీయతతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చర్చ..

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనలో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలుసుకున్నారు. నాలుగు నెలల క్రితం భార్య బ్రాహ్మణి (Brahmani), కుమారుడు దేవాన్ష్ (Devansh)తో కలిసి మోదీని కలిసిన లోకేశ్, తిరిగి తక్కువ వ్యవధిలోనే మరోసారి ఆయనను కలవడం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
సాధారణంగా ప్రధాని భేటీల్లో కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వస్తాయి. కానీ ఈసారి వచ్చిన చిత్రాలు భిన్నంగా ఉన్నాయి. లోకేశ్‌ను స్వాగతించేందుకు మోదీ స్వయంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తేనీటి విందు ఏర్పాట్లు మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటివరకు ఇతర నేతల భేటీల్లో ఇలాంటి దృశ్యాలు బయటపడకపోవడంతో, మోదీ-లోకేశ్ భేటీ ప్రత్యేకతను ఈ ఫోటోలు మరింతగా హైలైట్ చేస్తున్నాయి.
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సాధించిన ఘన విజయం కారణంగా లోకేశ్ పట్ల మోదీకి మరింత సాన్నిహిత్యం పెరిగినట్లు భావిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దక్షిణ భారతంలో బలం చేకూర్చడంలో లోకేశ్ పాత్ర ఉందని మోదీకి నమ్మకం ఏర్పడినట్లు విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయనను ఎప్పుడైనా కలిసినప్పుడు సాధారణ రాజకీయ నేతగా కాకుండా, స్నేహితుడిలా ఆత్మీయంగా పలకరించడం గమనార్హం. ఇంతకు ముందు విశాఖపట్నం (Visakhapatnam) పర్యటన సమయంలో కూడా మోదీ, “ఫ్యామిలీతో ఢిల్లీకి ఎప్పుడొస్తారు?” అని లోకేశ్‌ను అడిగిన విషయం తెలిసిందే.
ఈ స్నేహపూర్వక వాతావరణంలో దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. దేశంలో జీఎస్టీ (GST) రేట్లు తగ్గించడం వల్ల విద్యా రంగంలో ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గాయని, దీని కోసం రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా అమరావతి (Amaravati) నిర్మాణం, పోలవరం (Polavaram) పనులు గురించి వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమలకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను కూడా లోకేశ్ మోదీకి వివరించారు. ఇటీవల సింగపూర్ (Singapore)లో ఏపీ బృందం చేసిన పర్యటనలో వచ్చిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల గురించి మోదీ ఆసక్తిగా విన్నారని, అందులోని ప్రతీ అంశంపైనా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తం మీద మోదీ-లోకేశ్ భేటీ కేవలం ఒక మర్యాదపూర్వక సమావేశంగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై చర్చించే వేదికగా నిలిచిందని చెప్పాలి.