Pakistan: భారత్ తరహాలో పాక్ లోనూ ఏకీకృత కమాండ్ వ్యవస్థ…?
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ లో ఏకీకృతక కమాండ్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. త్రివిధ దళాలను సమన్వయంచేస్తూ ముందుకు సాగింది. దీంతో మూడు దళాలు.. ఒకదానికొకటి కోపరేట్ చేసుకుంటూ ప్రత్యర్థి రక్షణ శిబిరాలు, వ్యవస్థలపై విరుచుకుపడ్డాయి. ఫలితంగా మూడురోజుల్లోనే పాక్ … మన దళాలకు పాదాక్రాంతమైంది. సిందూర్ ఆపాలంటూ వినతులు, విజ్ఞాపనలు చేసుకుంటూ బతిమలాడుకుంది. దీంతో పాక్ సైతం… ఏకీకృత కమాండ్ వ్యవస్థ విశిష్టత అర్థం చేసుకుంది. తన రక్షణ వ్యవస్థలోనూ ఈ సిస్టమ్ ను ప్రవేశపెట్టేదిశగా పావులు కదుపుతోంది.
భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య సమన్వయం కోసం ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ‘కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్’ (సీడీఎఫ్) అనే సరికొత్త పదవిని సృష్టించనుంది. సీడీఎఫ్ ఈ ఏకీకృత వ్యవస్థకు అధిపతిగా ఉంటారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం శనివారం పాకిస్థాన్ పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టి అధికరణం 243లో మార్పులను ప్రతిపాదించింది. ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్న మునీర్‌ను కొత్తగా సృష్టిస్తోన్న సీడీఎఫ్‌గా నియమించనున్నట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మునీర్‌కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరుగుతుంది.
మునీర్‌కు అపరిమిత అధికారాలు..
పాక్ (Pakistan) ఆర్మీ చీఫ్ మునీర్ (Asim Munir) కు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం పావులు కదపడంపై ఆ దేశ ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాక్ రాజ్యాంగానికి 27వ సవరణ చేయడానికి నిరసనగా ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. వాస్తవానికి ఈ చర్యతో ఆర్టికల్ 243లో మార్పులు చేసి మిలటరీ కమాండ్‌లో అత్యున్నత పదవిని సృష్టించనున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ పదవిని తొలగించి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ నిర్ణయాలపై ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్…తెహ్రీకే తౌఫిజ్ అయీనే పాకిస్థాన్ సంస్థలు జాతీయ స్థాయిలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో పాక్ రాజ్యాంగం పునాదులే కదిలిపోతాయని ఆరోపించాయి.పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థలు మొత్తం కుంగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. దేశం మొత్తం 27వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా కదం తొక్కాలని కోరారు. ఇక పష్తూన్ఖవా మిల్లీ అవామీ పార్టీ నేత మహమూద్ ఖాన్ మాట్లాడూ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలకు నిరసనలు చేయడానికి మించి మరో అవకాశం లేదని చెప్పారు.
మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన 27వ రాజ్యాంగ సవరణపై దేశ వ్యాప్తంగా కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఆర్టికల్ 243లో మార్పులు సుప్రీం కోర్టుకు మృత్యువుతో సమానమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సీడీఎఫ్ పదవిని సృష్టిస్తే.. సైనిక దళాల్లో కూడా బ్యాలెన్స్ తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు.






