Pawan Kalyan: జాతి సంపదను కాపాడడం మనందరి బాధ్యత..పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తిరుపతి జిల్లా (Tirupati District) పర్యటనలో భాగంగా ఎర్రచందనం డిపోను సందర్శించారు. మంగళం ప్రాంతంలో ఉన్న ఆ డిపోలో ఎనిమిది గోడౌన్లు ఉండగా, ప్రతి గోడౌన్‌లోని ఎర్రచందనం దుంగలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతి దుంగను గమనిస్తూ అధికారులతో వివరణలు అడగడం అక్కడి సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
పవన్ మాట్లాడుతూ ఎర్రచందనం చెట్లను భారీ స్థాయిలో నరికి వేయడం వల్ల రాష్ట్ర వన్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో స్మగ్లర్లు కేవలం సంపద కోసం కాకుండా జాతి ఆస్తిని కూడా దోచుకున్నారన్నారు. అలాగే ఈ స్థితి గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. లక్షల సంఖ్యలో చెట్లను నరికి వేయడం వల్లే ఇన్ని దుంగలు డిపోల్లో నిల్వ ఉన్నాయని అధికారుల పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి విధ్వంసానికి ఎవ్వరినీ ఉపేక్షించబోమని, ఎర్రచందనం జాతి గౌరవానికి ప్రతీక అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన జియో ట్యాగింగ్ సాంకేతికతను వినియోగించి ప్రతి దుంగకు లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా బయటకు వెళ్లరాదని గట్టిగా హెచ్చరించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగ నుండి విక్రయానికి వెళ్లే దశ వరకు పూర్తి డేటా లైవ్‌గా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత పద్ధతిలో లాట్లు, నంబర్లు ఇవ్వడం కాకుండా ఆధునిక టెక్నాలజీ ద్వారా భద్రతా ప్రమాణాలు పెంచాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
పర్యటనలో ఉన్నప్పుడు పవన్ దృష్టిని ఒక విదేశీ మొక్క ఆకర్షించింది. టెరోమా జేరా (Teroma Zera) అనే జాతికి చెందిన ఆ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకులు రాలిపోయిన తర్వాత పూలు పూసి కనువిందు చేస్తుంది. ఈ వివరాలను విన్న పవన్ ఆ మొక్క పట్ల ఆసక్తి కనబరిచారు. ఏపుగా ఎదిగే ఈ మొక్క పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ఎర్రచందనం విలువైన చెట్టు అయినప్పటికీ దానికీ గ్రేడ్లు ఉంటాయి. నాణ్యత ఆధారంగా దుంగలకు గ్రేడ్లు నిర్ణయించబడతాయి. సుత్తితో దుంగ మీద కొట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి గ్రేడ్ గుర్తిస్తారు. పవన్ స్వయంగా ఆ ప్రక్రియను పరిశీలించారు. ఎర్రచందనం నుంచి తయారయ్యే విగ్రహాలు, చిన్న వస్తువులు, ఔషధాల్లో వినియోగించే రంపపు పొట్టు వంటి వాటిని కూడా ఆయన పరిశీలించారు. వాటి మార్కెట్, కొనుగోలు దరుల వివరాలు కూడా తెలుసుకున్నారు.
తన పర్యటనలో పవన్ కళ్యాణ్ చూపిన శ్రద్ధ, అటవీ వనరుల సంరక్షణపై ఆయన చూపిన కట్టుదిట్టమైన వైఖరి ప్రభుత్వ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యసంపద రక్షణ, చందన స్మగ్లింగ్ నియంత్రణ దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అటవీ శాఖకు కొత్త దిశ చూపిస్తున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.







