Mohan Bhagawat: మాది రాష్ట్రనీతి..రాజనీతి కాదన్న ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కీలక ప్రకటన చేసింది. తాము ఏ ఒక్క వ్యక్తికి కానీ, పార్టీకి కాని మద్దతివ్వడం లేదని తేల్చి చెప్పింది.కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటున్నట్లు సంస్థ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెంగళూరులో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రసంగ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
“మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనబోము. సమాజాన్ని ఏకం చేసే పనిలో సంఘ్ నిమగ్నమై ఉంది. కానీ రాజకీయాలు స్వభావరీత్యా విభజనకారిగా ఉంటాయి” అని వివరించారు. దేశానికి మేలు చేసే విధానాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, తమ ప్రభావాన్ని ఉపయోగించి సరైన విధానాలకు అండగా నిలుస్తామని తెలిపారు.
“ఉదాహరణకు, అయోధ్యలో రామ మందిరం కావాలని మేము కోరుకున్నాం. ఆ లక్ష్యం కోసం నిలబడిన వారికి మా వలంటీర్లు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఆ ఉద్యమంలో ఉంది కాబట్టి వారికి మద్దతిచ్చాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రామమందిర ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉంటే, మా కార్యకర్తలు ఆ పార్టీతోనే నిలబడేవారు” అని ఆయన తేల్చిచెప్పారు.
“మాకు ఏ పార్టీ సొంతం కాదు, అలాగని ఏ పార్టీ పరాయిదీ కాదు. ఎందుకంటే అవన్నీ భారతీయ పార్టీలే. మేము ‘రాష్ట్ర నీతి’కి మద్దతిస్తాం, ‘రాజనీతి’కి కాదు. ఈ దేశం ఏ దిశలో పయనించాలనే దానిపై మాకు ఒక దార్శనికత ఉంది. ఆ దిశగా ఎవరు పనిచేసినా వారికి మా మద్దతు ఉంటుంది” అని భగవత్ పేర్కొన్నారు.
జెండా వివాదంపై స్పష్టత
జాతీయ జెండాకు బదులుగా ఆర్ఎస్ఎస్ ఎందుకు కాషాయ జెండా (భగవా ధ్వజ్)ను ఉపయోగిస్తుందన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. “సంఘ్ 1925లో ప్రారంభమైంది. మాకు ఒక గురువు అవసరం. కానీ వ్యక్తిని గురువుగా స్వీకరిస్తే, వారికి పరిమిత ఆయుష్షు ఉంటుంది. అందుకే శాశ్వతంగా ఉండే మన సంస్కృతికి, హిందూత్వానికి ప్రతీకగా కాషాయ జెండాను గురువుగా స్వీకరించాం” అని తెలిపారు.
జాతీయ జెండాను 1937లో ఖరారు చేశారని, దాని రూపకల్పన జరిగినప్పటి నుంచి తాము త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తూనే ఉన్నామని అన్నారు. “ప్రైవేట్ సంస్థలు జాతీయ జెండాను ఎగురవేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, జనవరి 26, ఆగస్టు 15న అన్ని శాఖలలో జెండా వందనం చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్ర జెండా, కాంగ్రెస్‌కు వారి జెండా ఉన్నట్లే, మాకు కాషాయ జెండా ఉంది. ఇందులో వివాదం ఏమీ లేదు” అని స్పష్టం చేశారు.







