Pemmasani Chandrasekhar: పనితీరుకే పెద్దపీట.. కొత్త శైలి చూపించిన మంత్రి పెమ్మసాని

రాజకీయాల్లో పొగడ్తలు ఎంత ప్రధానమైపోయాయో అందరికీ తెలిసిందే. ఎలాంటి పనైనా జరగాలంటే నేతలను పొగడ్తలతో సత్కరించడం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ అందరూ అలాంటి దారిన వెళ్లడం లేదు. కొందరు మాత్రం పనితీరుకే ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో గుంటూరు (Guntur) ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.
తాజా ఎన్నికల్లో తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేసిన పెమ్మసాని, గుంటూరు పార్లమెంట్ సీటును గెలుచుకొని నేరుగా కేంద్ర మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తరచూ తన నియోజకవర్గంలో పర్యటిస్తూ, సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు అనుభవజ్ఞులైన నేతలు కూడా కేంద్రంలో బలమైన స్థానం కలిగిన పెమ్మసాని మంచి నాయకుడిని మెచ్చుకుంటున్నారు.
ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద నాయకుడు ఘనమైన సన్మానం చేయాలని ప్లాన్ చేశారు. ఈయన ఒక ప్రఖ్యాత కాంట్రాక్టర్ కూడా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కాంట్రాక్టులను నిర్వహించే ఈ నాయకుడు గతంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) ను ఘనంగా పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలా వారిని మచ్చిక చేసుకుని తన పనులు సాధించుకోవడమే ఆయన పద్దతి అని రాజకీయ వర్గాల్లో పేరు వచ్చింది.
ఈసారి అదే శైలిలో పెమ్మసాని చంద్రశేఖర్ కు సత్కారం చేయాలని భావించినా, మంత్రి మాత్రం విభిన్నంగా స్పందించారు. తన పుట్టినరోజు వేడుకల కోసం భారీ స్థాయిలో సన్మానం చేయడం అవసరం లేదని, ఆ డబ్బును ఉపయోగించి నియోజకవర్గంలోని పీ-4 పథకంలో రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇలా పనికి మేలు చేసే దిశగా ఆయన చూపిన మార్గం అనేక మందిని ఆకట్టుకుంది.
అయితే కాంట్రాక్టర్ మాత్రం సత్కారం వైపు మొగ్గుచూపడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఏర్పాట్లు చేయవద్దని , తన పర్యటనలకు కూడా ఆ వ్యక్తి రాకూడదని స్పష్టం చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ తన విధానాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. పెమ్మసాని చూపిన ఈ వైఖరి రాజకీయాల్లో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది నేతలు పనికంటే పొగడ్తలకు ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితుల్లో, ఆయన మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గం ఎంచుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం, సంక్షేమానికి ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకత. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, పనితీరు మీదే దృష్టి సారించి నేత ఎలా ఉండాలో పెమ్మసాని తన ఆచరణలో చూపించారని అంటున్నారు.