Trump: భారత్ కు దూరమయ్యామన్న ట్రంప్… బంధం బీటలు వారిందన్న అమెరికా దౌత్య నిపుణులు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తను చేస్తున్నది తప్పైనా, ఒప్పైనా చేసుకుంటూ పోతారు. తప్ప, దాని పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించరు. ఆయనలో వ్యాపార వేత్త ఎప్పుడూ మేలుకునే ఉంటారు. ఏ ఒప్పందమైనా ఆర్థిక కోణంలోనే చూస్తారు. ఫలితంగా దశాబ్దాలదౌత్య ఫలితాలను సైతం పణంగా పెట్టడానికి వెనకాడరు ట్రంప్. చైనా, రష్యాలకు దూరంగా భారత్ ను ఉంచడాన్ని తమ విదేశాంగ విధానంలో ఓ భాగం చేసుకున్న అమెరికాకు.. ఇప్పుడు అదే ఆసియా పవర్ ను దూరం చేసేశారు ట్రంప్.
అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై ఇరు ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఇప్పటికే పలువురు అమెరికా మాజీలు, దౌత్య నిపుణులు ట్రంప్ సర్కార్ కు సూచించారు.అయితే దీన్ని బేఖాతర్ చేశారు ట్రంప్. ఇప్పుడు ఆయనే స్వయంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయన్న కోణంలో వ్యాఖ్యానించారు.తాము భారత్, రష్యాలకు దూరమైనట్లే అన్నారు ట్రంప్. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోడీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వ్యంగ్యంగా పోస్టు పెట్టారు.
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ.. తియాన్‌జిన్ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సులో రష్యా, చైనా, భారత్ అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించిన వీరు.. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వీరి సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రంప్ తీరువల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా అమెరికాలో వినిపించింది. ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్ దూరమైనట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలుండేవని, అవి ఇప్పుడు ముగిశాయని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) స్పష్టం చేశారు. అది ప్రతి ఒక్కరికీ పాఠమని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో ఉండే సన్నిహిత సంబంధాలు ప్రపంచ దేశాల నేతలను దారుణ పరిస్థితుల నుంచి రక్షించలేవని హెచ్చరించారు. సుంకాల కారణంగా భారత్(India), అమెరికా (America) ల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.