Putin: మా టార్గెట్ ఉక్రెయిన్ మిత్రులే.. ఈయూకి పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..

రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా యూరోపియన్ యూనియన్ కు స్ట్రాంగ్ వార్నింగిచ్చారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను (Western Troops) మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉంటుందన్నారు. ఇటువంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న సన్నిహిత సైనిక సంబంధాలు ఇరుదేశాల మధ్య సంఘర్షణకు మూలకారణాలని వ్యాఖ్యానించారు.
ఇరుదేశాల మధ్య (Russia-Ukraine) శాంతిచర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో ఇతర దళాలను మోహరించాల్సిన అవసరం ఏముంటుందని పుతిన్ ప్రశ్నించారు. దీర్ఘకాలిక శాంతికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటే.. అసలు ఉక్రెయిన్‌లో ఇతర దళాలు మోహరించాల్సిన అవసరమే ఉండదన్నారు. తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటుందని తెలిపారు. 26 యూరప్ దేశాల నేతలు గురువారం పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)తో సమావేశమైన నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)తో సమావేశమైన ఐరోపా నేతలు కీవ్‌కు కావాల్సిన భద్రతా హామీల గురించి చర్చించారు. అమెరికా తరఫున ఈ భేటీలో ఆ దేశ ప్రత్యేక రాయబారి విట్కాఫ్ పాల్గొన్నారు. సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ భద్రతకు యూరోపియన్ దేశాలు హామీగా ఉంటాయన్నారు. శాంతిచర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించడానికి 26 యూరప్ దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌కు సుదీర్ఘ శ్రేణి క్షిపణులను సరఫరా చేయాలని ఈయూ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.