Ghaati Movie Review: మరో స్మగుల్డ్ కథ ‘ఘాటి’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవింద్ర విజయ్, జగపతి బాబు, జాన్ విజయ్, రాజు సుందరం తదితరులు
సంగీతం : విద్యాసాగర్ నాగవెల్లి, సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్: తోట తరణి, మాటలు : సాయి మాధవ్ బుర్రా
కథ : చింతకింది శ్రీనివాస రావు, ఎడిటర్ : చాణక్యరెడ్డి, వెంకట్ ఎన్ స్వామి
సమర్పణ: యూవీ క్రియేషన్స్
నిర్మాతలు : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేది : 05.09.2025
నిడివి : 2 ఘంటల 36 నిముషాలు
క్వీన్ అనుష్క శెట్టి,(Anuskha Shetty) విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Kriss Jagarlamudi) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా’ ఘాటి’. ‘ఘాటి’ అనే పేరు వినగానే.. ఏంటీ? అనే ప్రశ్న రాకమానదు. కొండల మధ్య ఉండే లోతైన దారి, లోయ అని అర్థం. గంజాయి సరఫరా నేపథ్యంలో నేరస్తురాలిగా మారిన బాధితురాలి కథ యే ‘ఘాటి’. చాల కాలం తరువాత అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబి వచ్చిన ఈ చిత్రం ఈ రోజు థియేటర్ లలో విడుదల అయ్యింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
ఓడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కుందల నాయుడు (చైతన్య రావు), కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్) తమ కనుసైగల్లో శాసిస్తు ఉంటారు.ఆ ప్రాంతంలోనే శీలావతి (అనుష్క శెట్టి)(Anushka Shetty) కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూ.. వైద్య వృత్తిలో ఉన్న దేశీ రాజు (విక్రమ్ ప్రభు)ను ప్రేమిస్తుంటుంది. అయితే కొండ ప్రాంతంలో గంజాయి రవాణా చేసే కూలీలు (ఘాటీలు) జరిగే అన్యాయాన్ని సహించలేక శీలావతి, దేశీ రాజు కూడా గంజాయి మాఫియాలోకి అడుగుపెడుతారు. అయితే ఘాటీల తిరుగుబాటును సహించలేని నాయుడు ఫ్యామిలీ.. శీలావతి, దేశీ రాజుపై కక్ష కడుతారు. ఆ క్రమంలో శీలావతి, దేశీ రాజు పెళ్లి రోజున కుందల, కష్టాల నాయుడు వారిపై ఎటాక్ ప్లాన్ చేస్తారు. గంజాయి మాఫియా వ్యవహారాలను కుందల, కష్టాల నాయుడు ఎలా కొనసాగించారు? ఉద్యోగాలు చేసుకొనే శీలావతి, దేశీ రాజు గంజాయి వ్యాపారంలోకి ఎందుకు ప్రవేశించారు? నాయుడు బిజినెస్‌కు అడ్డంకి మారిన శీలావతిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? ఘాటీలకు జరిగిన అన్యాయం, తనకు జరిగిన అవమానానికి శీలావతి ఎలా రియాక్ట్ అయింది? దేశీ రాజు లక్ష్యం ఏమిటి? తన ప్రియుడి లక్ష్యాన్ని శీలావతి పూర్తి చేసిందా? గంజాయి వ్యాపారాన్ని ఆపివేయాలని, అలాగే ఘాటీ వృత్తిని వదిలివేయాలని శీలావతి ఎందుకు యూటర్న్ తీసుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. జనంలో నుంచి వచ్చిన కథ జనానికి ఇట్టే చేరువౌతుంది. ఆ కథలో కనిపించే భావోద్వేగాలన్నీ వారి వారి జీవిత ప్రయాణాలే కావడంతో ఆ కథల్లో వాళ్లని వాళ్లు చూసుకుంటారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఘాటీల జీవన శైలిని కళ్లకి కడుతూ.. ‘గంజాయివనం’లో తులసిమొక్క లాంటి శీలవతి కథను సందేశాత్మకంగా చూపించారు.
నటీ నటుల హవబవాలు :
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమతి.. వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేసిన అనుష్క.. మళ్లీ హీరోల పక్కన సాధారణ హీరోయిన్‌గా పాటల కోసమో.. రెండు మూడు సీన్ల కోసమో సినిమాలు చేస్తుంది అనుకోవడం అత్యాశే. కథనాయకుడితో సమానంగా కథానాయికకి ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా అరుదు. టాలీవుడ్ అయితే మహా అరుదు. కానీ అనుష్కకి మాత్రం.. తాను నటించి పేరు తెచ్చిన చిత్రాలన్నింటిలోనూ హీరోతో సమానంగా ఆమెకి పేరు తీసుకుని వచ్చాయి. చాలా వరకూ లేడీ ఓరియెంటెండ్ సినిమాలే చేయడంతో.. చిత్ర విజయంలో పూర్తి క్రెడిట్ ఈమెకే దక్కింది. కాబట్టి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అనుష్క.. ‘ఘాటి’ చిత్రంతో మరోసారి యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఈ సినిమాకు సోల్, స్ట్రెంగ్త్, సర్వం శీలావతి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో అనుష్క శెట్టి పరకాయ ప్రవేశం చేసిందా? అనేంతగా పెర్ఫార్మ్ చేసింది. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకొన్నారు. సినిమా భారాన్ని తన భుజాలపై మోసి సినిమాను ముందుకు నడిపించింది. ఇక అనుష్కకు తోడుగా, సపోర్టివ్‌గా విక్రమ్ ప్రభు తన పాత్రకు న్యాయం చేశారు. ఇక కుందల నాయుడుగా చైతన్య రావు క్యారెక్టర్ ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. పూర్తిస్థాయి విలనిజాన్ని పండించడమే కాకుండా అనుష్కతో పోటిపడుతూ నటించాడు. జగపతి బాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, రాజు సుందరం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
తూర్పు కనుమల్లో గంజాయి సాగు విధానం, దానిని మాఫియా చేతుల్లోకి ఎలా వచ్చిందనే పాయింట్‌తో కథను దర్శకుడు క్రిష్ ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. స్టోరీ బ్యాక్ డ్రాప్, పాత్రల పరిచయం గురించి ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల అసలు కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ తీసుకొన్నాడనిపిస్తుంది. అయితే కథలో సమస్యను సృష్టించి సినిమాను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లడానికి అనుసరించిన విధానం ఫర్వాలేదనిపించే విధంగా ఉంటుంది, కానీ ప్రేక్షకుడి ఆలోచనలకు పదను పెట్టే విధంగా రైటింగ్ లేకపోవడం వల్ల ఫస్టాఫ్‌లో ఊపు కనిపించదు. అయితే కొన్ని సీన్లు ఎమోషనల్‌గా ఉండటంతో కథ, కథనాలు గాడిలో పడ్డాయని అనుకొనే లోపే పేలవమైన సీన్లతో రోటీన్ ఫార్మాట్‌లోకి దర్శకుడు నెట్టాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ చెప్ప తీరులో సాగదీత ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో శీలావతి క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా మార్చడం సినిమా పాజిటివ్ జోన్‌లోకి చేరుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే సన్నివేశాలను మరింత బెటర్ ప్రజెంట్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో క్రిష్ టీమ్ తమ కలాన్ని పూర్తి స్థాయిలో పదను పెట్టాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో క్రిష్ మూడు పాటలు రాయడం విశేషం. అడ్వెంచర్ డ్రామాకి పాత్రలతో పాటు.. విజువల్, మ్యూజిక్ చాలా కీలకం. ఘాటి సినిమా చాలా వరకూ రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించడంతో.. దృశ్యం, సంగీతం కథలో పాత్రలుగానే కనిపిస్తుంటాయి. మనోజ్ రెడ్డి కాటసాని కెమెరా వర్క్.. తూర్పు కనుమల్లో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలను కళ్లకి కట్టారు. ప్రకృతితో నడిచే కథ కావడంతో.. దర్శకుడి కథలోని సోల్‌ని స్క్రీన్‌పై కనిపించేట్టు చేశారు మనోజ్ రెడ్డి. సాగర్ మ్యూజిక్.. కథకి తగ్గట్టుగా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తుంది. పాటలన్నీ కథలో భాగంగానే.. కథని నడిపిస్తున్నట్టుగా ఉంటాయి. సాయి మాధవ్ అందించిన మాటలు పెద్దగా పేలలేదు.
విశ్లేషణ :
ఒక సోషల్ ఇష్యూపై సినిమా అంటే.. సమస్య నిర్మూలనకి ఊతమిస్తూ దాన్ని గ్లోరీఫై చేసేలా ఉండకూడదు. క్రిష్ చెప్పిన కథ.. దాని సెటప్ కొత్తగానే అనిపిస్తుంది కానీ.. ట్రీట్‌మెంట్ మాత్రం పాతగానే అనిపిస్తుంటుంది. కథాగమనం దేని కోసం అనేది? క్లారిటీ ఉండదు. తీరా క్లారిటీ ఇచ్చిన తరువాత.. దీని కోసమేనా? ఇలాంటి సోషల్ మెసేజ్‌లు చాలా సినిమాల్లో కనిపించినవే కదా అని అనిపిస్తుంది. ముందు తప్పులు చేయించి.. తరువాత వద్దని క్లాస్‌లు పీకడం.. దాని కోసం యుద్దం చేయడం.. రియలైజ్ కావడం.. నేను మారాను కాబట్టి నువ్వూ మారు అని చెప్పడం రొటీన్‌గా అనిపిస్తుంది. కథ బావున్నా స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదు. అనుష్కకి జరిగే అన్యాయం.. ఆ అన్యాయంపై తిరగబడే రివేంజ్ డ్రామా.. శత్రువుల్ని పట్టుపెట్టడం.. తన వాళ్లకి అండగా నిలబడటం లాంటివి.. తరువాత జరగబోయేది ఇదే అని ప్రేక్షకులకు పూస గుచ్చినట్టు అర్థమైపోవడం కథలో పెద్ద మైనస్ గా మారింది. అనుష్క పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్ ప్లే, నిడివి మైనస్ పాయింట్స్. సినిమాను ట్రిమ్ చేసి ఉంటే.. మూవీ బెటర్ ఫీల్ ఇచ్చి ఉండేదనిపిస్తుంది. క్యారెక్టర్లను తీర్చిదిద్దిన తీరు బాగున్నప్పటికీ.. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అయి ఉండేది. మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను అనుష్క కోసమే థియేటర్‌లో చూడాలి.