Chandrababu Naidu: విశాఖలో మీడియేషన్ కాన్ఫరెన్స్.. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలపై సీఎం పిలుపు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈరోజు విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ (International Mediation Conference)లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో వేగం, సమర్థత, అందుబాటు కీలకమని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి “ఈజ్ ఆఫ్ జస్టిస్” (Ease of Justice) విధానం తప్పనిసరని ఆయన తెలిపారు. ఈ విధానంలో మధ్యవర్తిత్వం (Mediation), ఆర్బిట్రేషన్ (Arbitration) ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.
చరిత్రలోనూ మధ్యవర్తిత్వం కొత్త కాదని ఆయన గుర్తుచేశారు. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు (Sri Krishna) ఒక సమర్థవంతమైన మీడియేటర్‌గా వ్యవహరించారని ఉదాహరణగా చెప్పారు. పూర్వం మన గ్రామాల్లో పెద్దలు వివాదాలను కోర్టులకెళ్లకుండా సమర్థంగా పరిష్కరించేవారని అన్నారు. ఆ సంప్రదాయానికి ఆధునిక రూపమే ఈ ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రజలు వివాదాలను కోర్టులకే పరిమితం చేయకుండా ఈ విధానాలను ఉపయోగిస్తే సమాజానికి ప్రయోజనం ఉంటుందని సూచించారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, సంవత్సరానికి వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మక కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నందున భవిష్యత్తులో వివాదాలు సహజమని, వాటి పరిష్కారానికి మీడియేషన్, ఆర్బిట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. దీని కోసం టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని, వర్చువల్ హియరింగ్స్ (Virtual Hearings), ఈ-ఫైలింగ్ (E-Filing), మొబైల్ అప్‌డేట్స్ (Mobile Updates) వంటి ఆధునిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా న్యాయం అందుతుందని వివరించారు.
విశాఖపట్నం (Visakhapatnam)లో ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకో సిస్టమ్ (Alternative Dispute Resolution Ecosystem) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం అవసరమే అయినప్పటికీ, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ వంటి విధానాలను ప్రోత్సహించడం మరింత ఫలప్రదమని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది పౌరులు కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగడం అవమానంగా భావిస్తున్నారని, అలాంటి వారికి మీడియేషన్ చక్కటి పరిష్కారమని సూచించారు.
దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే వివాదాలు తగ్గించుకోవడం అత్యవసరమని, ఆ దిశగా కొత్త సంస్కరణలు తీసుకురావడం అవసరమని సీఎం తెలిపారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తేనే ప్రజల నమ్మకం పెరుగుతుందని అన్నారు. న్యాయం వేగంగా, పారదర్శకంగా అందించగలిగితే సమాజంలో శాంతి నెలకొంటుందని, అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.