China: చైనా శత్రుభయంకరి ఫ్యుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్..!
ప్రపంచ సూపర్ పవర్ కావాలన్న తన ఆశయాన్ని నిజం చేసుకునే దిశగా చైనా (China) అడుగులేస్తోంది. ఓవైపు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యం సాధిస్తూ .. ఉపరితల రంగంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు సముద్రంలోనూ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు మరింతగా శ్రమిస్తోంది. దీనిలో భాగంగా అత్యంత అధునాతనమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.. చైనా నేవీకి అప్పగించారు. ఇది చైనా నేవీకి మూడో విమాన వాహక నౌక కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఉన్న రెండు నౌకల కంటే ఈ నౌక మరింత శక్తివంతమైందని తెలుస్తోంది. ఇక నేవీ సామర్థ్యంలో అమెరికాకు ధీటుగా చైనా అప్డేట్ అవుతోంది. ఇక ఇప్పటివరకు అమెరికా షిప్‌లలో ఉపయోగించే.. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటపుల్ట్లను.. చైనా తాజా నౌకలో ఏర్పాటు చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళాలలో ఒకటిగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా.. చైనా అత్యంత అధునాతన విమాన వాహక నౌక ‘ఫుజియాన్’ను అధికారికంగా ప్రారంభించింది. ఈ యుద్ధనౌక రంగ ప్రవేశం.. చైనా రక్షణ సామర్థ్యాల్లో ఒక కీలక మైలురాయిగా చైనా ప్రభుత్వ మీడియా అభివర్ణించింది. ఈ ఫుజియాన్ యుద్ధనౌక అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటపుల్ట్లే కావడం విశేషం. ఈ అత్యాధునిక వ్యవస్థ.. నౌకపై నుంచి యుద్ధ విమానాలను అతి వేగంగా ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా మాత్రమే కావడం గమనార్హం.
ఈ అత్యాధునిక కాటపుల్ట్ టెక్నాలజీని తమ యుద్ధనౌకలో ప్రవేశపెట్టాలని.. వ్యక్తిగతంగా జిన్‌పింగ్ నిర్ణయించడం విశేషం. చైనా వద్ద ఇప్పటికే రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. లియానింగ్, షాన్డాంగ్ అనే విమాన వాహకనౌకల కంటే ప్రస్తుతం కమిషనింగ్ అయిన ఫుజియాన్ చాలా శక్తివంతమైనదని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఫుజియాన్ ఎక్కువ ఆయుధాలను, ఇంధన లోడ్‌తో కూడిన విమానాలను మోయగలదని పేర్కొంది. ఈ విమాన వాహకనౌక ద్వారా శత్రు లక్ష్యాలను మరింత ఎక్కువ దూరం నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఛేదించగలవని తెలిపింది.
చైనా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ నౌక.. ఫ్లాట్ ఫ్లైట్ డెక్ కలిగి ఉంది. దీనికి మూడు వేర్వేరు రకాల విమానాలను ప్రయోగించగల సామర్థ్యం ఉంది. షీ జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తన నౌకాదళాన్ని అత్యం వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త నౌక సేవలు ప్రారంభించడం ద్వారా.. చైనా ఇప్పుడు మొత్తం నౌకల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్న దేశంగా నిలిచింది. చైనా చేస్తున్న ఈ వేగవంతమైన సైనిక విస్తరణ అమెరికా, దాని మిత్రదేశాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







