Chandra Babu: ప్రజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల గైర్హాజరు పై చంద్రబాబు ఫైర్..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన పని తీరు, క్రమశిక్షణతో మరోసారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణ — అన్నీ ఒకేసారి నడిపిస్తూ ఆయన రోజులో ఒక్క క్షణం కూడా వృథా చేయడం లేదు. అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగించడమే కాకుండా, విదేశాల్లో పెట్టుబడులను తెచ్చేందుకు వ్యక్తిగతంగా చర్చలు జరుపుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రతి నెలా 1వ తేదీ ఉదయం తప్పక సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించి వారి సమస్యలు వినడం ఆయన అలవాటుగా మారింది.
అయితే ఈసారి ఆయన దృష్టికి వచ్చిన ఒక అంశం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. పెన్షన్ పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు (MLAs) పాల్గొనలేదనే నివేదిక అందింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతల మధ్య కూడా తాను ప్రతి కార్యక్రమానికి హాజరౌతుంటే.. మిగిలిన వారికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించారు., ప్రజలతో మమేకమవ్వడం ప్రజా ప్రతినిధుల మొదటి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. తగిన వివరణ లేకుండా కార్యక్రమాలకు దూరమయ్యే నేతలపై సీరియస్గా వ్యవహరించాలని టీడీపీ (TDP) ప్రోగ్రామ్ కమిటీకి ఆదేశాలు ఇచ్చారు.
ఆ ఎమ్మెల్యేలందరికీ కారణం అడుగుతూ నోటీసులు ఇవ్వాలని, వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “పార్టీని బలపరచాలంటే ప్రజలతో ఉన్న అనుబంధం బలంగా ఉండాలి. దానిని నిర్లక్ష్యం చేస్తే క్షమించం” అని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల నిబద్ధతతో, కష్టపడి పనిచేసే కార్యకర్తలను గౌరవించాలని, అలాంటి వారిని పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించడం అనైతికం అని అన్నారు.
ఇక మరోవైపు చంద్రబాబు, నారా లోకేశ్ (Nara Lokesh) ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబగళ్లు శ్రమిస్తుంటే, కొంతమంది నేతలు మాత్రం వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరాటాలతో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారి సమస్యలను పరిష్కరించేందుకు కూడా చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తోందని తెలుస్తోంది.
పార్టీ పట్ల అంకితభావం లేని కొందరు నేతల ప్రవర్తనపై తెలుగు తమ్ముళ్ల (Telugu Desam cadre) మధ్య అసహనం నెలకొంది. ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక నుంచి టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు దిశల్లోనూ పునరుత్తేజంతో ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే పార్టీ లోపల తలెత్తుతున్న ఈ సమస్యలను బాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి..






