Parliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు..!
పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఈ తేదీలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫలప్రదమైన, అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నట్టు రిజిజు పేర్కొన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అత్యంత క్లుప్తమైన శీతాకాల సమావేశాల్లో ఇది ఒకటి .
గతేడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20న ముగిశాయి. 26 రోజుల వ్యవధిలో లోక్సభ 20 సార్లు, రాజ్యసభ 19 సార్లు సమావేశమయ్యాయి. ఆ సెషన్లో లోక్సభ ఉత్పాదకత 54.5 శాతంగా, రాజ్యసభ ఉత్పాదకత 40 శాతంగా నమోదైంది. అప్పుడు ఐదు బిల్లులను ప్రవేశపెట్టగా, ‘భారతీయ వాయుయాన్ విధేయక్ 2024’ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి.
ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు జరిగాయి. ఆ సమావేశాల్లో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో ఉభయ సభల్లో ఉత్పాదకత గణనీయంగా తగ్గింది. లోక్సభ కేవలం 31 శాతం, రాజ్యసభ 38.8 శాతం ఉత్పాదకతను మాత్రమే నమోదు చేశాయి. ఆ సెషన్లో 15 బిల్లులు చట్టరూపం దాల్చాయి.







