Amit Shah: బిహార్ నుంచి చొరబాటుదార్లను పూర్తిగా తొలగిస్తాం: అమిత్ షా
బిహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం హీటెక్కుతోంది. ఈ క్రమంలో పూర్ణియాలో బీజేపీ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని చొరబాటుదార్లందరినీ తొలగిస్తామని ప్రకటించారు. ‘లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ.. నేను చెప్పేది వినండి. మేం చొరబాటుదార్లను గుర్తించి, వారి ఓట్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తాం. ఆ తర్వాత వాళ్లను దేశం నుంచి కూడా బహిష్కరిస్తాం’ అని తేల్చిచెప్పారు.
ఇలాంటి చొరబాటు దార్లను కాపాడేందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నిరోజుల క్రితం యాత్ర చేశారని, తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నించారని అమిత్ షా (Amit Shah) విమర్శించారు. సీమాంచల్ ప్రాంతాన్ని చొరబాటుదార్లకు అడ్డాగా మార్చారంటూ కాంగ్రెస్, ఆర్జేడీలపై విమర్శల వర్షం కురిపించారు. ఈ ప్రాంతంలో చొరబాటుదార్లు అతిపెద్ద సమస్య అని చెప్పిన ఆయన.. వచ్చే ఐదేళ్లలో బిహార్లో చొరబాటుదార్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ‘మొత్తం సీమాంచల్ ప్రాంతంలో చొరబాటుదార్లు అతిపెద్ద సమస్యగా ఉంది. వచ్చే ఐదేళ్లలో వీళ్లందర్నీ ఈ ప్రాంతం నుంచి తొలగిస్తాం’ అని ఆయన (Amit Shah) హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఎన్డీయే కూటమికి 160పైగా సీట్లు వస్తాయని అనిపిస్తోందన్నారు.







